ప్రతి ఏడాది సెప్టెంబర్ నెల వస్తుందంటే చాలు.. యాపిల్‌కు చెందిన కొత్త ఐఫోన్ల కోసం ఆ ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఫోన్ విడుదల రోజు షాపుల ఎదుట క్యూలు కట్టి మరీ కొత్త ఐఫోన్లను కొంటుంటారు. ఇది ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుంది. అయితే కరోనా వల్ల ఈసారి కొత్త ఐఫోన్ల విడుదల మరింత ఆలస్యమవుతుందని తెలుస్తుండగా.. తాజాగా ఆ ఫోన్లకు చెందిన డిజైన్ లీకైంది. అయితే ఆ డిజైన్ మరీ పేలవంగా ఉందని ఐఫోన్ ప్రియులు షాక్‌కు గురవుతున్నారు.
యాపిల్ సంస్థ త్వరలో విడుదల చేయబోయే ఐఫోన్ 12కు చెందిన డిజైన్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో లీకైంది. టెక్నాలజీ రంగానికి చెందిన మిస్టర్ వైట్ అనే వ్యక్తి ఎప్పటికప్పుడు ఈ డిజైన్లను లీక్ చేస్తుంటారు. ఈ సారి కూడా ఆ వ్యక్తి ఐఫోన్ 12 డిజైన్‌ను లీక్ చేశారు. అయితే ఆ డిజైన్ ఐఫోన్ ప్రియులను షాక్‌కు గురి చేస్తోంది. ఎందుకంటే.. అది కొత్త డిజైన్ ఏమీ కాదు.. పాతదే. ఒకప్పుడు వచ్చిన ఐఫోన్ 4ను పోలిన డిజైన్‌ను ఐఫోన్ 12 కలిగి ఉంది. అలాగే గత మోడల్స్‌లో వచ్చిన నాచ్‌ను కొత్త ఫోన్‌లోనూ అదే సైజులో ఇచ్చారు. ఆ నాచ్‌ను యాపిల్ ఈసారి తగ్గిస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో కొత్త ఐఫోన్ డిజైన్ అభిమానులను నిరాశ పరుస్తోంది.
ఐఫోన్ 12లో ఫేస్ ఐడీ అలాగే ఉంటుందని మనకు లీకైన డిజైన్‌ను బట్టి చూస్తే తెలుస్తుంది. అయితే లీకైన డిజైన్ ప్రొ మోడల్‌కు చెందినదా.. బేసిక్ మోడల్‌కు చెందినదా.. అనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ ఐఫోన్ 12కు చెందిన 5.4 ఇంచ్ బేసిక్ మోడల్ డిజైన్ అదని తెలుస్తోంది. మరి ఐఫోన్ 12 ప్రొ మోడల్స్‌లోనూ ఇదే డిజైన్‌ను ఇస్తారా, లేక మారుస్తార.. అన్న వివరాలు తెలియడం లేదు. అయితే ఈసారి కూడా యాపిల్.. ఐఫోన్ 12, 12ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ మోడల్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది.
కొత్త ఐఫోన్లను యాపిల్ చక్కని డిజైన్‌తో అందిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ యాపిల్ మాత్రం ఐఫోన్ 4 డిజైన్‌తో వాటిని విడుదల చేస్తుందని తెలుస్తుండడంతో ఐఫోన్ ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. మరోవైపు ఐఫోన్ 12 మోడల్స్ లో 5జి కూడా ఉంటుందని తెలుస్తుండడంతో యాపిల్ ఆ ఫోన్లను భారీ ధరకు విక్రయిస్తుందని సమాచారం. అదే జరిగితే ఐఫోన్ 12 అభిమానులను అంతగా ఆకట్టుకునే అవకాశం ఉండదు. ఓ వైపు పాత తరహా డిజైన్, మరోవైపు పెద్దదైన నాచ్, ఇంకో వైపు భారీ ధర.. దీంతో ఐఫోన్ 12 మోడల్స్‌ను ఎవరైనా అసలు కొంటారా..? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఈ విషయాలపై స్పష్టత రావాలంటే ఐఫోన్ 12 మోడల్స్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే..!