తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నెంబర్ తెలుసు కదా.. ఆరు! తాను వాడే కాన్వాయ్ నుంచి.. తనకు సంబంధించిన అన్ని విషయాల్లో ఏదో ఓ రకంగా ఈ నెంబర్ ఉండేలా చూసుకుంటారని అందరూ చెప్పుకుంటారు. కేసీఆర్ అదృష్ట సంఖ్య అయిన ఆ ఆరు.. ఇప్పుడు తన ఫ్యామిలీ పాలిటిక్స్‌కు కూడా అప్లై అయ్యేలా ఉంది.
కేసీఆర్‌తో కలిపి.. ఇప్పటివరకు ఆయన కుటుంబం నుంచి ఐదుగురు సభ్యులు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కొత్తగా ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి ఆరో లీడర్ కూడా రాజకీయాల్లో రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. డెక్కన్ క్రానికల్ పత్రిక ఇందుకు సంబంధించిన ఓ కథనాన్ని ప్రచురించింది.
తన సోదరుడి కుమారుడైన వంశీని.. కేసీఆర్ రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల వంశీ తరచూ ప్రగతి భవన్‌లోనే కనిపిస్తున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. కేసీఆర్ నిర్వహించే అనేక సమావేశాల్లోనూ వంశీ పాల్గొంటున్నారని అంటున్నారు. ఓ జ్యోతిష్కుడి సలహా మేరకే కెసీఆర్ ఇవన్నీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా.., ఆయన కుమారుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు మంత్రిగా ఉన్నారు. ఆయన మేనల్లుడు హరీష్ రావు మరో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా ఓటమి పాలైన ఆయన కూతురు కవితను ఎమ్మెల్సీగా చేసి తిరిగి రాజకీయంగా యాక్టీవ్ చేశారు. మరో సోదరుడి కుమారుడైన సంతోష్ రావుని ఎంపీగా రాజ్యసభకు పంపించారు.తాజాగా వంశీ ఇప్పుడు తెరపైకి వచ్చారు.
కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి కొందరు నేతలు ఇప్పటికే తమ పనుల కోసం వంశీని సంప్రదిస్తున్నారట. ముఖ్యంగా రెవెన్యూతో పాటు హైదరాబాద్ భూములకు సంబంధించి తమ సమస్యలను వంశీకే చెప్పుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిస్థితులను చూస్తోంటే త్వరలోనే వంశీ రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డెక్కన్ క్రానికల్ రాసిన ఈ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.