విపక్షాల విమర్శల నడుమ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించేందుకు మోడీ సర్కార్ రెడీ అవుతోంది. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను అధికారులు చెక చెకా పూర్తి చేస్తున్నారు. మే 28న నిర్వహించే వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు.
పార్లమెంట్‌ను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని రెండు దశలుగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీ 28వ తేది ఉదయం 7 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ నూతన భవనం వద్దకు చేరుకుంటారని తెలుస్తోంది. ఉదయం 7.30 గంటలకు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ భవనం వద్ద పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ పూజా కార్యక్రమంలో ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సహా పులువురు సీనియర్ మంత్రులు పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు ప్రధాని మోడీ లోక్ సభ చాంబర్ లోకి వెళతారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో సెంగోల్ ను లోక్ సభ స్పీకర్ చైర్ దగ్గర ప్రతిష్టించనున్నారు. 9.30 గంటలకు ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం మోడీ పార్లమెంట్ నుంచి వెళ్లిపోతారు.
ఉదయం 11.30 గంటలకు అతిథులు హాజరు కానున్నారు. 12 గంటలకు మోడీ పార్లమెంట్ వద్దకు వస్తారు .12.10 గంటలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చదివి వినిపించనున్నారు. 12,17 గంటలకు రెండు ష్టార్ ఫిల్మ్స్ ను ప్లే చేయనున్నారు.
12.38 గంటలకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత ప్రసంగించాల్సి వుండగా ఆయన హాజరు కావడం లేదు. ఆ తర్వాత లోక్ సభ స్పీకర్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు రూ. 75 నాణేన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 1.10 నిమిషాలకు మోడీ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ముగియనుంది.
ఈ కార్యక్రమానికి హాజరు కాబోమని ఇప్పటికే 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. ఇక పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 75 రూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తైన సందర్బంగా నాణేన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నాణేనికి ఓ వైపున పార్లమెంట్ కొత్త భవనం ముద్రించి వుంటుంది.
నాణేనికి ఓ అంచున సంసద్ సంకుల్ అని దేవనగరి లిపిలో మరో అంచున పార్లమెంట్ కాంప్లెక్ అని ఆంగ్లంలో ముద్రించనున్నారు. నాణేనికి ఓ వైపు సింహం గుర్తు కలిగిన అశోకుడి స్తంభం ఉంటుంది. దాని కింద సత్యమేవ జయతే అని ముద్రించి ఉంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 35 గ్రాముల బరువుండే ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, చెరో ఐదు శాతం నికెల్, జింక్ లోహాలతో తయారు చేయనున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.