వరుస ఓటముల తర్వాత పీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదలైన రాజీనామా డిమాండ్ వినిపిస్తూనే ఉన్నా… గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వినిపించింది. ఫైనల్ గా కెప్టెన్ సాబ్ హ్యాండ్సప్ అనేశారు. దీంతో కొత్త పీసీసీ చీఫ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
నిజానికి బీజేపీతో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ, గెలవాలన్న తపన లేక… ఆధిపత్య పోరులో కాంగ్రెస్ ఓడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు కూడా బలమైన నేతను నాయకునిగా నియమించే అవకాశం, పార్టీని బ్రతికించే అవకాశం కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలోనే ఉంది.
పార్టీ గ్రాఫ్ ఇంత దిగజారుతున్నా… పీసీసీ రేసులో చాలా మందే ఉన్నారు. ఫైనల్ గా ఎంపీ కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలలో ఒకరు పీసీసీ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 9న అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాలంటున్నాయి. డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టినరోజు కావటంతో పాటు తెలంగాణ ఇస్తున్నామన్న ప్రకటన వచ్చిన రోజు. దీంతో అదే రోజు పీసీసీ ప్రకటన ఉండే అవకాశం కనపడుతుంది.