తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీలో హీట్ పుట్టిస్తోంది. అధిష్టానం ఆదేశాలతో రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ రాష్ట్ర నేతల అభిప్రాయాలు సేకరించి ఢిల్లీ చేరుకున్నారు. దీంతో పీసీసీకి కొత్త సారథి ఎవరనేది ఇక హస్తిన నాయకత్వమే నిర్ణయించనుంది. అయితే పీసీసీ కొత్త నాయకత్వం పై రాష్ట్రంలో లీడర్లు ఒక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే.. క్యాడర్ మరోరకంగా స్పందించినట్టుగా తెలిసింది.
పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని పీసీసీ కోర్ కమిటీ, అలాగే ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులు మాత్రమే కోరితే.. మిగిలిన వారంతా భిన్నంగా స్పందించినట్టుగా సమాచారం. టీఆర్ఎస్, బీజేపీని ఢీకొట్టి, పార్టీని ముందుకు నడిపించే నేతను ఎంపిక చేయాలని పీసీసీలో మిగిలిన నేతలు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కోరినట్టుగా తెలుస్తోంది. పార్టీ గెలవాలంటే సీనియార్టి ముఖ్యం కాదని,.. సీరియస్ నెస్, సిన్సియారిటీ ఉన్న నేతనే ఎంపిక చేయాలని వారు బలంగా తమ వాదనను వినిపించినట్టుగా నేతలు ముచ్చటించుకుంటున్నారు.
రెండు, మూడు రోజుల్లో మాణికం ఠాగూర్ పార్టీ నేతల అభిప్రాయాలతో కూడిన సమగ్ర నివేదికను ఏఐసీసీ అధిష్ఠానానికి అందజేయనున్నారు. దీంతో ఢిల్లీ పెద్దలు ఎవరిని ఫైనల్ చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.