అంతర్గత, అంతర్జాతీయ వలసదారుల హక్కులు, సంక్షేమం కోసం ప్రవాసీ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలు జరిపామని, లాక్ డౌన్ సమయంలో 40 కోట్ల మంది వలస కార్మికులు నడుచుకుంటూ తమ స్వస్థలాలకు వెళ్లారని, ఒక కోటి యాభై లక్షల మంది భారతీయులు విదేశాలలో నివసిస్తుండగా వారిలో 88 లక్షల మంది గల్ఫ్ దేశాలలో ఉన్నారని ఆయన అన్నారు. దేశ విదేశాల్లో పనిచేస్తూ భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రవాసీలను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని దేవేందర్ రెడ్డి విమర్శించారు.
వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి వలస కార్మికుల జాతీయ వేదికల నిర్మాణం కోసం ‘నేషనల్ నెట్ వర్క్ ఫర్ మైగ్రంట్ వర్కర్స్’, ‘నేషనల్ ఫెడరేషన్ ఫర్ మైగ్రంట్ వర్కర్స్’ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి తెలిపారు.
ఇదిలా ఉండగా నంగి దేవేందర్ రెడ్డి బిజెపికి, మంద భీంరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రవాసీ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా తాము ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తమ పార్టీలకు సోమవారం రాజీనామా చేసినట్లు ప్రకటించారు.