- ఉద్యోగుల పీఆర్సీ అమలులో కేంద్రం బాటలో తెలంగాణా ?
- ప్రతి పదేళ్లకు ఒకసారి మాత్రమే పీఆర్సీ అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
- ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం
- ప్రస్తుతం దేశంలోనే తెలంగాణా ఉద్యోగులు అత్యధిక వేతనాలు పొందుతున్నారని ప్రచారంలో ఉన్న ఓ బలమైన వాదన
- ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కన్నా ఎక్కువ వేతనాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు
- అడిషనల్ సెక్రెటరీ స్థాయి అధికారికి సీనియర్ ఐఏఎస్‌ల కంటే ఎక్కువ వేతనం
- వేతనం తగ్గుతుందనే కారణంగా కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా పొందడానికి వెనకడుగు వేస్తున్న అడిషనల్ సెక్రెటరీ స్థాయి అధికారులు
- సచివాలయంలో సీఎంఓలో పనిచేసే ఒక అత్యున్నత స్థాయి అధికారికంటే, ఆయన అటెండర్‌కే ఎక్కువ జీతం
- పీఆర్సీని నియంత్రించాలనే ప్రతిపాదనలను సీరియస్‌గా పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవ పీఆర్సీ, అది కూడా తెలంగాణా ఆవిర్భవించాక ఏర్పడ్డ మొట్ట మొదటి పీఆర్‌సీ ఇప్పుడు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టని వ్యవహారంగా తయారైంది. పదవ పీఆర్సీ గడువు గత ఏడాది జూన్‌తో ముగిసింది. 2018 జులై ఒకటో నుంచే కొత్త వేతన సవరణ జరగాలి. రెండు నెలల ముందుగానే అంటే మే 18న రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సీఆర్ బిస్వాల్ ఛైర్మన్‌గా తెలంగాణ తొలి పీఆర్సీ కమిటీని ప్రభుత్వం నియమించింది. మూడు మాసాలలో తుది నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించింది. బిస్వాల్ కమిటీ వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో అభిప్రాయాలు తీసుకుని నివేదికను సిద్దం చేసింది. ఎప్పుడంటే అప్పుడు ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ రాష్ట్ర సర్కార్ ఈ కమిటీకి ఇంతవరకు సమయం ఇవ్వకపోవడం ఉద్యోగ సంఘాలలో ఆందోళనకు కారణమవుతోంది.
పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతోందో లెక్కలు పంపాలని ఆర్థికశాఖకు పైనుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇది బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 5.29 లక్షల మందికి పీఆర్‌సీ అమలు చేయాలి. ఇప్పుడున్న జీతాలపై ఒక్క శాతం ఫిట్‌మెంట్ అమలు చేసినా ఖజానాపై రూ. 225 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. 27 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే ఏడాదికి అదనంగా సుమారు రూ.6 వేల కోట్ల భారం అవుతుంది. ఇదే అంశాన్ని ఆర్థిక శాఖ సీఎంకు నివేదించింది.
కొత్త పీఆర్సీ ఇప్పుడుిచ్చినా నాలుగేళ్లలో మరో పీఆర్సీ వేయాల్సి వస్తుందని, ఇలా ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ వేస్తే ఖజానాపై అంతకంతకు భారం పెరుగుతుందని సీఎం ముందు జరిగిన సమీక్షల్లో ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. ఏటా ఉద్యోగుల జీతాలకు రూ.36 వేల కోట్లు ఖర్చవుతున్నాయని, ఈ ఖర్చులు తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేస్తున్నట్టు పదేళ్లకు ఒకసారి జీతాలు పెంచడం మంచిదని కొందరు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పొరుగు రాష్ట్రాల్లోనూ కేంద్రం అనుసరించే విధానమే అమల్లో ఉందని వారు ఉదాహరణలతో సహా చెప్పారు. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం వారిని ఆదేశించారని సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు ఇప్పటికే జీతాలు బాగా ఎక్కువ ఇస్తున్నామనే అభిప్రాయం సర్కారులో వుంది. రాష్ట్రం వచ్చిన కొత్తలో జీతాలు భారీగా పెంచామని, ఇప్పుడు మళ్లీ జీతాలు పెంచడం అవసరమా.. అని ప్రగతి భవన్‌తో రోజూ టచ్‌లో వుండే ఓ ముఖ్య అధికారి అన్నట్టు భోగట్టా. కేంద్రం తరహాలో పదేళ్లకు ఒకసారి జీతాలు పెంచితే సరిపోతుందని ఆ అధికారి అభిప్రాయం. కేంద్రం పదేళ్లకు ఒకసారి పీఆర్సీ వేస్తుంది. అదే తరహాలో ఇక్కడ కూడా అమలు చేయాలనే ఆలోచన ప్రభుత్వంలో నలుగుతోందని ఆ అధికారి ఒకరిద్దరితో అన్నట్టు సమాచారం. కేంద్రం డీఏ పెంచినప్పుడు ఇక్కడ కూడా డీఏ ఇస్తే సరిపోతుందన్నారు. ఇంత శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమేంటని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. పదేళ్లకు ఒకసారి పీఆర్సీ వేస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయం అధికార పార్టీలో కనిపించడం లేదని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఉద్యోగులు టీఆర్ఎస్‌కు ఓటు వేయలేదని అభిప్రాయంలో సర్కార్ పెద్దలు వున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మెజారిటీ ఓట్లు టీఆర్ఎస్‌కు రాకపోవడాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఉద్యోగులు వేయకపోయినా మెజార్జీ అసెంబ్లీ స్థానాలలో గెలిచామనే ధీమా వారిలో వుంది.