తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త సారథులు రాబోతున్నారు. ఈ నెలతో బీజేపీ అధ్యక్షుల పదవీకాలం ముగియనుండటంతో… కొత్త అధ్యక్షుల వేట ఇప్పటికే మొదలైంది. రెండోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దక్షిణాదిలో బీజేపీ బలం పుంజుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో… దూకుడుగా వెళ్లే నేతలవైపు కేంద్ర నాయకత్వం మొగ్గుచూపుతున్నట్లు కనపడుతోంది.
తెలంగాణలో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌పై సాఫ్ట్ కార్నర్ ఉండటంతో రెండోసారి కొనసాగిస్తారు అనే ప్రచారం కూడా ఉంది. అయితే… బీజేపీలో ఇటీవలే తెరపైకి వచ్చిన బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌లు కూడా పోటీలో ఉండటంతో ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. బండి సంజయ్ దూకుడుకు హిందూ కార్డు అడ్వాంటేజ్ అవుతుండగా… ఏకంగా సీఎం కూతుర్ని ఓడించి జెండా ఏగురవేయటంతో పాటు తన తండ్రి అండగా ఉండటం ఎంపీ అర్వింద్‌కు ప్లస్ పాయింట్ అవుతుంది.
ఇక ఏపీలో ఎంపీ సుజనా చౌదరి అధ్యక్ష పదవి రేసులో ముందున్నారు. ఎంపీలను పార్టీలోకి తీసుకరావటంతో పాటు ఆర్థికంగా కూడా బలమైన నేత కావటంతో సుజనాకు ప్లస్ పాయింట్ కాగా బీజేపీ సీనీయర్ నేత జీవీఎల్ కూడా రేసులో ఉన్నారు. అయితే వైసీపీకి జీవీఎల్ సానుకూలంగా ఉంటారన్న పేరుండటం జీవీఎల్‌కు మైనస్ అన్న చర్చ సాగుతోంది. వీరిద్దరితో పాటు ఎంపీ సీఎం రమేష్ కూడా అద్యక్ష రేసులో ఉన్నప్పటికీ… కన్నాకు మరోసారి అవకాశం ఇస్తుండొచ్చని ఏపీ బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఏపీ కన్నా కూడా తెలంగాణలో బీజేపీ అద్యక్ష పదవి ఎవరికి ఇస్తారు, కేసీఆర్-బీజేపీ అగ్రనేతల మధ్య దూరం పెరిగిందన్న వార్తలు వస్తున్నందున అవి ఎంతవరకు నిజమో కొత్త అద్యక్ష నియామకంతో తెలిసిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.