హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్ట్ పేరుతో నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలకు డబ్బులు అందిస్తోంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రభుత్వానికి తలనొప్పి మొదలైంది. ఈ స్కీంను అందరికీ వర్తింపజేయడం కష్టమనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ తర్వాత నగదు జమ అంటే కష్టమే. ఈలోగా అందరికీ ఇచ్చేద్దామంటే ఉన్నది తక్కువ సమయం. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అధికారులు.
ప్రస్తుతానికి 17 వేల మంది దాకా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. ఇంకో 7వేల మందికి పైగా ఇవ్వాల్సి ఉంది. మరి.. వీరందరికీ ఒకేసారి ఏక కాలంలో అకౌంట్లను తీయడం, డబ్బు జమ చేయడం సాధ్యమయ్యే పని కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదీకాకుండా ఇప్పటిదాకా డబ్బులు అందిన లబ్ధిదారులకు యూనిట్లు కేటాయించే ప్రక్రియలో కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వారు ఎంపిక చేసుకున్న వాటికి సంబంధించిన కొటేషన్లు, వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ సకాలంలో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
మరోవైపు జిల్లా అధికారులు మాత్రం నోటిఫికేషన్ కు ముందే ఈ పథకం ఉంది కాబట్టి అమలు చేస్తామని చెబుతున్నారు. అయితే లబ్ధిదారులు ఉపాధి పొందేందుకు అవసరమైన ప్రాసెస్ ను కొనసాగించడం ఇబ్బందికరమే. ఎందుకంటే ఎంపిక చేసుకున్న యూనిట్లపై వారికి శిక్షణ ఇచ్చే విధానానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోక తప్పదని తెలుస్తోంది. మరి.. దానికి ఈసీ ఓకే అంటుందా..? లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.