కరోనా మహామ్మారి జనజీవనాన్ని అతలకుతలం చేసింది. చాలా మంది ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. కొంతమంది వైరస్‌తో పోరాడి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అయితే, కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అంతా బాగానే ఉందని భావించడానికి లేదు. ఎందుకంటే కరోనా తర్వాత ఎన్నోకొత్త సమస్యలు వస్తున్నాయి. పలు రకాల వ్యాధులు వేధిస్తున్నాయి. తాజాగా కోవిడ్ సోకిన వారిలో కొత్త సమస్యలను గుర్తుంచారు వైద్య నిపుణులు.
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులకు నరాల సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు ఓ కొత్త అధ్యయనంలో తేలింది. అర చేతులు, పాదాల్లో నొప్పి, మంట వస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. జర్నల్ పెయిన్‌లో దీనికి సంబంధించిన నివేదికను ప్రచురించారు. కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వారిలో నరాల నొప్పి మూడింతలు అధికంగా ఉంటుందని, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, మంట పుట్టడం లాంటి రుగ్మతలు ఉంటాయన్నారు.
కరోనా వైరస్ వల్ల నరాలు దెబ్బతినే అవకాశం ఉందని, దాని వల్ల ఫెరిఫెరల్ న్యూరోపథీ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సైమన్ హరౌటోనియన్ తెలిపారు. వారు అధ్యయనం చేసిన వారిలో 30 శాతం మంది పేషెంట్లలో నరాల సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. కొన్ని కేసుల్లో మూడు నెలల వరకు కూడా ఆ సమస్యలు ఉత్పన్నమైనట్లు ప్రొఫెసర్ సైమన్ తెలిపారు. ముందు నుంచి ఆరోగ్య సమస్యలు ఉండి, ఆ తర్వాత కరోనా పాజిటివ్ తేలిన వ్యక్తిలో దీర్ఘకాలిక నొప్పులు ఉన్నట్లు గుర్తించారు.
ఈ వైరస్ సోకిన రోగుల్లో ఇప్పటికే అనేక ఆరోగ్య పరమైనా సమస్యలను పరిశోధకులు గుర్తించారు. పలు రకాల మెదడు, స్ట్రోక్, వెన్నెముక సంబంధిత సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని వివరించారు. ఇవి అరుదుగా కనిపించే సమస్యలు అయినప్పటికీ, బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశముందని వారు చెబుతున్నారు.