ఈ నెల 28 న ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనానికి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా ఆర్ధిక మంత్రిత్వ శాఖ రూ. 75 నాణేన్ని విడుదల చేయనుంది. దీని విశేషాలు చాలానే ఉన్నాయి. 35 గ్రాముల బరువు ఉండే ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ తో తయారు చేశారు. 44 మి.మీ. వ్యాసం కల్గిన ఈ కాయిన్ ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
అశోక స్థంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నంతో బాటు లయన్ క్యాపిటల్ కింది భాగంలో ‘సత్యమేవ జయతే’ అన్న పదం, ఎడమవైపున ‘భారత్’ అన్న పదం దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది.
కుడివైపు ఇంగ్లీషులో ;ఇండియా’ అని రాసి ఉంటుంది. దీనిపై రూపీ సింబల్ తో బాటు డినామినేషన్ వ్యాల్యూ గా 75 అని స్పష్టం చేయడమే గాక నాణెం వెనుక ఎగువ అంచుపై ‘సంసద్ సంకుల్’ అని దేవనాగరి భాషలో, కింది అంచున ‘పార్లమెంట్ కాంప్లెక్స్’ అని ఇంగ్లీషులో ఉంటుందని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి.
75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకొంటున్న సందర్భంగా ఈ కాయిన్ ని రిలీజ్ చేస్తున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇక నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలక ఎన్డీయే లోని 18 సభ్య పార్టీలతో బాటు ఏడు ఎన్డీయేతర పార్టీలు పాల్గొంటున్నాయి. శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ, జేడీ-ఎస్, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), వైఎస్సార్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, టీడీపీ వంటివి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాయి. అయితే కాంగ్రెస్ సహా సుమారు 20 పార్టీలు దీన్ని బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ప్రధాని మోడీ ప్రభుత్వ దురహంకారం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు.