ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్ వల్ల పలు వస్తువుల ధరలు పెరగగా కొన్ని వస్తువుల ధరలు తగ్గాయి. ఈ క్రమంలోనే కొత్తగా అనేక వస్తువులు, సేవలపై అగ్రి సెస్‌ను వసూలు చేయనున్నారు. అయినప్పటికీ వాటికి ధరలు పెరగడం లేదు. కారణం ఇతర పన్నులను ఆమేర సవరించారు. అయితే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేశంలో పలు కొత్త నియమాలు కూడా అమలులోకి వచ్చాయి. అవేమిటంటే…
ముంబై లోకల్ ట్రెయిన్స్
సుదీర్ఘ విరామం అనంతరం ముంబై లోకల్ ట్రెయిన్ సర్వీస్‌లను మళ్లీ నడిపిస్తున్నారు. అయితే సాధారణ ప్రజలు నిర్దేశించిన సమయాల్లో మాత్రమే ఆ రైళ్లలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉదయం 7 లోపు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య, రాత్రి 9 తరువాతే సాధారణ ప్రజలు ఆ ట్రెయిన్లలో ప్రయాణం చేయవచ్చు.
డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేశంలోని ఓటర్లందరూ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డులను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు గాను ఓటర్ ఐడీ కార్డులు మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉండాలి. ఓటర్ ఐడీ కార్డులను డౌన్‌లోడ్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ రూపంలో వస్తాయి. వాటిని ఎడిట్ చేయడం కుదరదు. కానీ వాటిని ఓటర్లు ప్రింట్ తీయించుకుని లామినేషన్ చేయించుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ ఇ-క్యాటరింగ్ సర్వీసులు
కరోనా వల్ల ప్రస్తుతం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. అయితే కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లలో ఐఆర్‌సీటీసీ ఇ-క్యాటరింగ్ సేవలను అందిస్తోంది. ఈ సేవలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రయాణికులకు లభిస్తున్నాయి. మొత్తం 62 స్టేషన్లలో తొలి దశ కింద ఇ-క్యాటరింగ్ సేవలను అందిస్తున్నారు. వాటిల్లో న్యూఢిల్లీ, లక్నో, భోపాల్, సూరత్, పూణె, అహ్మదాబాద్, హౌరా, పాట్నా, విజయవాడ, ఎర్నాకులం, ఉజ్జయిని, పన్వెల్ తదితర స్టేషన్లు ఉన్నాయి.
కొత్త ఏటీఎం రూల్స్
ప్రస్తుతం దేశంలో రెండు రకాల ఏటీఎంలు ఉన్నాయి. నాన్ ఈఎంవీ, ఈఎంవీ అని. నాన్ ఈఎంవీ అంటే ఏటీఎం కార్డును పెట్టి తీస్తే ట్రాన్సాక్షన్ అవుతుంది. కార్డులోని డేటాను మాగ్నెటిక్ స్ట్రిప్ ద్వారా ఏటీఎం మెషిన్ రీడ్ చేస్తుంది. రెండో రకం ఏటీఎంలలో ట్రాన్సాక్షన్ పూర్తయ్యే వరకు కార్డును అలాగే ఉంచాలి. చిప్ ఉన్న కార్డులను ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అయితే మొదటి రకం.. అంటే నాన్ ఈఎంవీ ఉన్న ఏటీఎంలలో డబ్బును విత్ డ్రా చేసేందుకు, ఇతర లావాదేవీలు చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అనుమతించడం లేదు. తమ కస్టమర్లకు మరింత రక్షణను అందించడానికి, మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ బ్యాంక్ తెలియజేసింది.
కొత్త కోవిడ్ రూల్స్
కరోనా వల్ల థియేటర్లలో ఇప్పటి వరకు 50 శాతం కెపాసిటీతో సినిమాలను ప్రదర్శించేందుకు అనుమతిచ్చారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి సినిమా థియేటర్లు 100 శాతం కెపాసిటీతో సినిమాలను ప్రదర్శించుకోవచ్చు. కానీ మాస్కులను ధరించాల్సి ఉంటుంది. అలాగే థియేటర్లలో ప్రతి షో అనంతరం శానిటైజేషన్ చేయాలి. ఇక స్విమ్మింగ్ పూల్స్ ను తెరిచేందుకు కూడా కేంద్రం అనుమతిచ్చింది.