తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి గడువు సమీపిస్తుండడంతో వేగంగా తుది మెరుగులు దిద్దుతున్నారు. సచివాలయ నమూనాకు సంబంధించి ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని ఓ వీడియోను విడుదల చేశారు. ఇక ఏప్రిల్ 30 వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేయాలని అధికారులు, ఇంజినీర్లను సీఎం ఇప్పటికే ఆదేశించారు. ప్రధాన పనులన్నీ పూర్తి కాగా సచివాలయ భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఫర్నీచర్, పెయింటింగ్, ల్యాండ్ స్కేపింగ్, ఎలివేషన్, నెట్ వర్కింగ్ తదితర పనులు వేగంగా సాగుతున్నాయి. సచివాలయం భవనం, భవనంలోని ఛాంబర్లు, సమావేశ మందిరాలు, ప్రవేశ ద్వారాలు, పచ్చికబయళ్లు, ఫౌంటెయిన్లు, భవనం చుట్టూ నలువైపులా విశాలమైన రహదార్లు, కాంప్లెక్స్, గుడి, చర్చ్, మసీదులు తదితరాల నమూనాకు సంబంధించిన వీడియోను ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని విడుదల చేశారు.
ఇక నూతన సచివాలయం ఆరో అంతస్తులో కేసీఆర్ క్యాబిన్ ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆయన గదికి సంబంధించి పూర్తి స్థాయిలో తుది మెరుగులు దిద్దుతున్నారు. తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. ఆరు అంతస్తుల మేర హుస్సేన్ సాగర్ సమీపాన నూతన సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు పనికొచ్చే విధంగా పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రీన్ బిల్డింగ్ పద్ధతిలో నూతన సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో వైపు వచ్చే నెల 5 లోగా అంబేడ్కర్ విగ్రహ నిర్మాణపనులు పూర్తి చేయాలి. 14న అట్టహాసంగా ప్రారంభోత్సవం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.