వరంగల్ నగరం అరుదైన గుర్తింపు సాధించింది. కేంద్రం నిర్వహించిన ‘సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో దేశవ్యాప్తంగా చోటు దక్కించుకున్న 11 నగరాల్లో ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా 107 నగరాలు పోటీపడగా.. తెలంగాణ నుంచి వరంగల్ ఒక్కటే ఎంపికైంది. పోటీలో నెగ్గిన ఈ 11 నగరాలు రూ. కోటి ప్రోత్సాహకంగా అందుకోనున్నాయి.
కాజీపేటలోని ఫాతిమా బ్రిడ్జి నుంచి సుబేదారి వరకు రోడ్డుకు ఇరువైపులా 4 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ వేశారు. ఎరుపు రంగు వేసి ప్రత్యేకంగా సైకిళ్లు వెళ్లేలా తీర్చిదిద్దారు. రోడ్డుపై ఉండే ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా స్పష్టమైన విభజనతో దీన్ని ఏర్పాటు చేశారు.రానున్న కాలంలో 50 కి.మీ. మేర సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.దీనికి రూ. 40 కోట్ల నుంచి రూ .50 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.
సిటీ కల్చర్‌లో ఇప్పుడు సైక్లింగ్ కూడా ఒక భాగంగా మారుతోంది. వరంగల్‌లో విశాలమైన రోడ్లు, జాతీయ రహదారులు, NIT అలాగే ప్రముఖ విద్యాసంస్థలు ఉండటంతో… సైక్లింగ్ సంస్కృతి ఎప్పటి నుంచో కొనసాగుతోంది. విద్యార్థులు, ఇతర పౌరులే కాకుండా, వరంగల్‌లో యాక్టివ్‌గా పనిచేసే సైక్లింగ్ క్లబ్‌లు కూడా ఉన్నాయి, ఇవి సైక్లింగ్‌ను ఆరోగ్యకరమైన అలవాటుగా ప్రోత్సహిస్తాయి. అలా ఈ అలవాటు పెరగడమే తప్ప.. తగ్గే అవకాశం లేదనే విషయాన్ని గ్రహించి.. నగర అధికారులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.
ఇతర నగరాల్లో సైక్లింగ్ ట్రాక్‌లు రోడ్డు అనుకునే ఉంటాయని కానీ.. వరంగల్లో మాత్రం పూర్తిగా వేరుగా నిర్మించాని అంటున్నారు సైక్లిస్టులకు రోడ్డును ఉపయోగించే వాహనాలతో ఎలాంటి ప్రమాదం ఉండకూడదని ఇలా చేసినట్టు చెప్తున్నారు. సైక్లింగ్ కోసం శాశ్వత విభజన కలిగిన ఏకైక నగరం వరంగల్ అని గర్వంగా చెబుతున్నారు. ఇంత ఘనత సాధించిన కొన్ని చోట్ల ఇది మూడునాళ్ల ముచ్చటే అవుతోంది. సైక్లింగ్ ట్రాక్‌లో కొందరు వీధి వ్యాపారులు దుకాణాలు పెడుతుండగా.. మరికొన్నిచోట్ల వాణజ్య సంస్థలు పార్కింగ్ కోసం వాడుతున్నాయి. వీటిని పరిష్కరిస్తే ఈ సంస్కృతి నిరాటంకంగా కొనసాగుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.