ఓ వైపు దేశంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతోంటే.. మరో వైపు కొత్త రకం కలవరపెడుతోంది. రోజు రోజుకి ఇండియాలో యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగుతోది. తాజాగా కొత్త రకం వైరస్ బారినపడిన బాధితుల సంఖ్య 82కు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. బుధవారం నాటికి ఈ కేసుల సంఖ్య 73గా ఉండగా.. కొత్తగా 9 కేసులు పెరిగినట్టయింది. బాధితులు ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో యూకే స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఆ దేశానికి విమానాల రాకపోకలను నిలిపివేసిన కేంద్రం.. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో యూకే-భారత్ మధ్య యధావిధిగా సర్వీసులు కొనసాగుతున్నాయి. దీంతో బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికుల గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా అక్కడి నుంచి వచ్చేవారికి ఎయిర్‌పోర్టులోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం చెబుతోంది. యూకే నుంచి వచ్చినవారేగాక… ఇతర దేశాల నుంచి వచ్చేవారు కూడా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది.