కరోనాపై అధ్యయనాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కొవిడ్ మహమ్మారి చైనాలోని వూహాన్ మార్కెట్ నుంచి వ్యాప్తి చెందినట్టు తాజాగా రెండు అధ్యయనాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన నివేదికలను జర్నల్ సైన్స్ లో పబ్లిష్ చేశారు.
మొదట వూహాన్ లోని ల్యాబ్ నుంచి కొవిడ్ వ్యాప్తి చెందిందని సందేహాలు వచ్చాయి. ఆ తర్వాత వూహాన్ లోని మార్కెట్ నుంచి కరోనా వ్యాప్తి చెందిందని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి ఎక్కడ నుంచి మొదలైందన్న అంశంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌లో ఉన్న జంతువుల నుంచి మనుషులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టు అధ్యయనాలు వెల్లడించాయి.
మార్కెట్ ప్రాంతంలో తొలుత చాలా కేసులు నమోదైనట్టు అధ్యయనాలు స్పష్టం చేశాయి. కరోనా వ్యాప్తి గురించి జన్యు సమాచారం ద్వారా రెండో స్టడీ తేల్చింది.
2019 నవంబర్ లేదా డిసెంబర్‌లో మనుషుల్లోకి రెండు వేరియంట్లు ప్రవేశించాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. 2019లో మార్కెట్ లో అమ్మిన జంతువుల్లో సార్స్ సీవోవీ 2 వైరస్ ఉన్నట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు.
జంతువుల నుంచి ఆ వైరస్ సెంటర్ లో పనిచేస్తున్న వారికి తొలుత ట్రాన్స్ మిట్ అయినట్టు చెప్పారు. దీంతో ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సోకినట్టు తేల్చి చెప్పారు.
గ్లాస్గో వర్సిటీ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ డేవిడ్ రాబర్ట్‌సన్ ఓ నివేదికను రూపొందించాడు. ఈ వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందన్న వాదనలను ఇది సరి చేస్తుందన్నారు. దీంతో ఈ విషయం ఓ కొలిక్కి వచ్చిందన్నారు.
వుహాన్ నగరంలో తొలుత ఆస్పత్రిలో చేరిన వారిలో 50 శాతం మందికి మాత్రమే సీఫుడ్ మార్కెట్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. వుహాన్ కేసులను తాము మ్యాపింగ్ చేశామని, తద్వారా కొన్ని స్పష్టమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆరిజోనా యూనివర్సిటీలోని ఎకాలజీ, ఎవల్యూషనరీ బయాలజీ శాఖ ప్రొఫెసర్ మైఖేల్ వోరోబే పేర్కొన్నారు.
మార్కెట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సేకరించిన శ్యాంపిల్స్ ఆధారంగా కేసు మ్యాప్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. మార్కెట్‌కు దక్షిణంగా ఉన్న ప్రాంతంలో కరోనా ఎక్కువగా కేసులు కేంద్రీకృతమై ఉన్నట్లు గుర్తించినట్టు ప్రొఫెసర్ రాబర్ట్‌సన్ పేర్కొన్నారు.
రక్కూన్ డాగ్స్‌ను ఆ ప్రాంతాల్లో అధికంగా అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. సార్స్ సీవోవీ2 వైరస్ మోసుకువెళ్లే జంతువులను అక్కడ అమ్ముతున్నట్టు పేర్కొన్నారు.