సీఎం కేసీఆర్ కు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. తెలంగాణలో ఖాళీగా ఉండి, కరోనా కారణంగా వాయిదా పడిన ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అతి త్వరలోనే ఎన్నికపై షెడ్యూల్ రాబోతుంది.
మండలి చైర్మన్ గా పనిచేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, బోడికుంట్ల వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, ఫరీదుద్దీన్ లు తమ పదవీకాలం ముగించుకున్నారు. వీరి స్థానంలో కొత్త వారి ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, ఈ ఆరు స్థానాలకు డజనుకు పైగా నేతలు క్యూలో ఉన్నారు. దీంతో సీఎం కేసీఆర్ కు ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగానే తయారైంది.
ఓవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలో చేర్చుకున్న ఎల్.రమణ, గుత్తా, దళిత నేత కడియంతో పాటు గతంలోనే హామీ పొందిన నేతలు కూడా ఉన్నారు. ఖమ్మం నుండి తుమ్మల, నల్గొండ నుండి కర్నె ప్రభాకర్, కరీంనగర్ నుండి వినోద్ కూడా ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తున్నారు. పైగా రీసెంట్ గా రిటైర్ అయిన ఆకుల లలిత, ఫరీదుద్దీన్ కూడా రెన్యూవల్ కోరుతున్నారు. పైగా కేసీఆర్ కు గతంలో ఆర్థికంగా అండగా ఉన్న వారు సైతం ఎమ్మెల్సీ లిస్టులో ఉన్నారు. దీంతో కేసీఆర్ ఎవరి వైపు మొగ్గుచూపుతారు అన్నది కీలకంగా మారింది.