సీఎం కేసీఆర్ తీసుకోబోతున్న నిర్ణయం హుజురాబాద్ ఉప ఎన్నికపై పడనుందా…? అక్టోబర్ లో ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తే మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ భయపడుతున్నారా…? తానే ప్రతిపక్షాలకు అస్త్రం అందివ్వకూడదని ఆలోచిస్తున్నారా…? కానీ ఖజానా నిండకపోతే వచ్చే అనర్ధాలు టెన్షన్ పెడుతున్నాయా…?
త్వరలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచబోతున్నాం అంటూ సీఎం కేసీఆర్ హింట్ ఇచ్చేశారు. పైకి క్యాబినెట్ నిర్ణయం అని చెప్పినా కేసీఆర్ మాటే శాసనం అనేది అందరికీ తెలిసిందే. సో… చార్జీలు పెంచటం దాదాపు ఖాయం. ఫలితంగా ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు హుజురాబాద్ బై పోల్ రాబోతుంది. అసలే గ్రౌండ్ లో పరిస్థితులను తమవైపుకు తిప్పుకునేందుకు కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు, దళిత బంధు అంటూ హాడావిడి చేస్తున్నారు. కానీ ఒక్కసారి చార్జీలు పెంచేస్తే ప్రతి ఇంట్లో ఇబ్బందులు తప్పవు. సో అది మైనస్ గా మారే ప్రమాదం ఉంది. పైగా ప్రతిపక్షాలకు కొత్తగా ఓ అస్త్రం ఇచ్చినట్లే.
పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినందుకు బీజేపీకి ఓటెయ్యాలా… ఓటు వేసే ముందు గ్యాస్ ధర ఎంత పెరిగిందో గుర్తు చేసుకొండి అంటూ ఇన్నాళ్లు మంత్రి హరీష్ రావు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు…? అదే ప్రతిపక్షాల నినాదం కూడా కాబోతుంది.
పోనీ… బై పోల్ అయ్యే వరకు ఆగుతారా అంటే అది వచ్చే ఏడాదిలో పడుతుంది. అప్పుడు జనరల్ ఎన్నికల వరకు దాన్ని ప్రతిపక్షాలు సాగదీస్తూనే ఉంటాయి. అసలే అన్ని పార్టీల నేతలు పాదయాత్రల పేరుతో జనంలో ఉన్నారు. ఊరూరా చాటింపు వేసినట్లుగా చార్జీల పెంపును చాటి చెప్పుతారు. అది కూడా రాబోయే ఎన్నికల వరకు సాగదీస్తారు. సో కేసీఆర్ కు ఇప్పుడు ఈ చార్జీల పెంపు ఎటూ చూసినా ఇబ్బందిగానే తయారు కాబోతుంది.