– మెడికో ప్రీతి మరణంపై కొత్త చర్చ
– అడ్మిషన్ బాండ్ కూడా కారణమై ఉండొచ్చనే వాదన
ఒక మృతి.. ఎన్నో అనుమానాలు. తనంతట తానే చనిపోయిందా? లేక చంపేశారా? ప్రీతి మృతిపై ఎన్నో డౌట్స్ అలాగే ఉండిపోయాయి. ఓవైపు సైకో సైఫో వేధిస్తున్నాడు.. తట్టుకోలేక చదువు మానేద్దామంటే సవాలక్ష రూల్స్. ఇలా ప్రీతి ఎన్నో భయాలతో సతమతం అయినట్టు తెలుస్తోంది. ఎంబీబీఎస్ పీజీ సీటు రావడం మామూలు విషయం కాదు. ఊరు గాని ఊరిలో ఒంటరిగా కుటుంబానికి దూరంగా చదువు అంటే ఎంతో ధైర్యం ఉండాలి. పైగా మూడేళ్ల కోర్సు పూర్తి చేయడం కూడా ఓ సవాల్.
తరగతులతోపాటు ప్రాక్టికల్ గా ఆస్పత్రుల్లో సీనియర్లతో కలిసి పని చేయాలి. వారి ఆలోచనలకు తగ్గట్టుగా నడవడం అనేది ఓ చాలెంజ్ లాంటిదే. సైఫ్ లాంటి ఆకతాయిలుంటే అంతే సంగతులు. ప్రీతి ఘటనలో కొత్తగా బాండ్ అంశం తెరపైకి వచ్చింది. సైఫ్ వేధింపులు తట్టుకోలేక మధ్యలో మానేద్దామని అనుకుంటే.. అడ్మిషన్ బాండ్ కింద లక్షలు కట్టాల్సి రావడంతో ఆమె ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని అంటున్నారు.
పీజీ సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్ బాండ్ రూ.50 లక్షల అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్నాక కారణాలేవైనా కోర్సు మధ్యలో డ్రాప్ అయితే.. ఆ మొత్తం తిరిగి కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి చెల్లించాలట. ఇదే ఇప్పుడు ప్రీతి పాలిట శాపమైందనే వాదన వినిపిస్తోంది. గతేడాది వర్సిటీ మెడికల్ పీజీ సీటు మధ్యలోనే ఆపేస్తే రూ.20 లక్షలు చెల్లించాలన్న నిబంధన ఉండేది. అయితే.. చాలామంది విద్యార్థులు మధ్యలోనే వెళ్లిపోతున్నారన్న కారణంతో ఈ ఏడాది రూ.50 లక్షలకు పెంచారట. దీంతో చాలామంది విద్యార్థులు వేధింపులు, ర్యాగింగ్, ఇతరత్రా ఏం ఉన్నా వాటిని భరిస్తూ పీజీ పూర్తి చేస్తున్నారని టాక్.
సైఫ్ నుంచి వేధింపులు ఎక్కువవడంతో పీజీ కోర్సు ఆపేసి రావొచ్చు కదా అని తండ్రి అన్నప్పుడు రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది కదా అని ఆమె చివరి మాటల్లో చెప్పినట్లుగా చెప్పుకుంటున్నారు. వేధింపులు తట్టుకోలేక, డ్రాప్ అయితే అంత మొత్తం కట్టలేక ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అందుకే, కొత్త అడ్మిషన్ బాండ్ నిబంధనలు తీసుకువచ్చి విద్యార్థులకు ఉపశమనం కలిగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే, ర్యాగింగ్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.