బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శరణ్య అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త రోహిత్ పై ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.శరణ్య,రోహిత్ ఇద్దరిదీ కామారెడ్డి. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఒకర్నొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్సే. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగరీత్యా బెంగళూరుకు షిఫ్టయ్యారు.చాలా అన్యోన్యంగానే ఉండేవాళ్లు.కానీ ఆతరువాత రోహిత్ వైఖరిలో మార్పు వచ్చింది. అతను మద్యానికి బానిసకావడంతో కాపురంలో గొడవలు మొదలయ్యాయి.
అతని టార్చర్ భరించలేక మూడు నెలల కిందట శరణ్య పుట్టింటికి వచ్చేసింది. రోహిత్ కామారెడ్డికి వచ్చి..తప్పయిందని ఒప్పుకున్నాడు. పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదిరింది. శరణ్య భర్తతో కలిసి బెంగళూరుకు వెళ్లింది. ఈ క్రమంలోనే దారుణం జరిగింది. శరణ్య తాము వుంటున్న ప్లాట్లోనే అనుమానాస్పదస్థితిలో చనిపోయింది. విషయం తెలిసిన వెంటనే తల్లిదంద్రులు కామారెడ్డి నుంచి బెంగళూరుకు వెళ్లారు. శరణ్య మరణానికి భర్త రోహితే కారణమని ఆరోపించారు. అతనే హత్య చేసి వుండాలి లేదంటే ఆత్మహత్య చేసుకునేలా వేధించివుంటాడన్నారు. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిజానిజాలేంటో విచారణలో తేలుతాయి.