హైదరాబాద్ వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా రాబరి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు బ్యాంక్ లో క్యాషియర్ గా పని చేస్తున్న ప్రవీణ్ అనే ఉద్యోగి క్యాష్ తో పరారయ్యాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా ప్రవీణే స్వయంగా తనకు మెసేజ్ చేశాడని బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశాడు.
ఈ నేపథ్యంలో బ్యాంక్ కేసు కొత్త మలుపు తిరిగింది. క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. బ్యాంకులో అక్రమాలను ప్రశ్నించినందుకే తనను టార్గేట్ చేస్తున్నారని ప్రవీణ్ ఆరోపించాడు. ఓ ఎన్ఆర్ఐ అకౌంట్స్ విషయంలో అక్రమ నగదు బదిలీలను గతంలో ప్రశ్నించానని వివరించాడు. క్యాష్ క్యాబిన్ లో సీసీ కెమెరాలు సరిగాలేవని గతంలో చెప్పానని వీడియోలో వెల్లడించాడు.
క్యాష్ పెట్టేందుకు కూడా సేఫ్ లాకర్ లేదని ప్రవీణ్ తెలిపాడు. గతంలో పలుమార్లు క్యాష్ షాటేజ్ వస్తే వడ్డీకి తెచ్చి కట్టానని ప్రవీణ్ వివరించారు. ఇప్పుడు 23 లక్షల షాటేజ్ రావడంతో కట్టలేక పారిపోయానని సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు ప్రవీణ్.
బ్యాంక్ లావాదేవీల్లో తక్కువగా వచ్చిన మొత్తాన్ని తనపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు ప్రవీణ్. తనకు జరిగిన అన్యాయం జరగకుండా చూడాలని వేడుకున్నాడు. హైదరాబాద్ వచ్చి పోరాటం చేస్తానని చెప్పాడు.