1. అక్టోబర్, నవంబర్ నెలల్లో కరోనా కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ హెచ్చరించింది. వచ్చే రెండు-మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతానికైతే దేశంలో కొత్త కేసుల నమోదు స్థిరంగా కొనసాగుతోందని, కేరళలోనూ తగ్గుతున్నాయని తెలిపింది. అయితే మిజోరాంలో పరిస్థితి కొంత ఆందోళన కలిగిస్తున్నట్టుగా వెల్లడించింది.
2. దేశంలో కరోనా మరో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు కేంద్రం సన్నద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా3,631 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని.. ఇవి పూర్తయితే 4,500 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.
3. కోవిడ్-19 నిర్వహణలో మోదీ సర్కార్ తీరును విమర్శిస్తూ ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని కేంద్రం ఖండించింది. ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ఉద్దేశ్యం, పత్రిక తమ గుర్తింపుకోసం ఆరాటపడుతున్నట్టుగా ఆ కథనం ఉందని ఆరోపించింది. ఇదిలా ఉంటే .. మోదీ రాజకీయ లక్ష్యాల కోసం ఐసీఎంఆర్ అధికారులు కరోనా వైరస్ తీవ్రతను తక్కువ చేసి చూపిస్తున్నారని, మోదీ ప్రాధాన్యతల ప్రకారమే వారు పనిచేస్తున్నారని ది న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలనం కథనాన్ని ఇటీవల తమ ప్రతికలో రాసింది.
4. చార్‌ధామ్ యాత్రపై విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేసింది. దాదాపు మూడు నెలల తర్వాత యాత్రను తిరిగి ప్రారంభించడానికి అనుమతించింది . ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకుని, కరోనా నెగెటివ్ ధ్రువపత్రాన్ని కలిగి ఉన్న యాత్రికులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని సూచించింది. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి,యమునోత్రి పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని కోర్టు ఆదేశించింది.
5. గర్భిణీ స్త్రీలకు కరోనా సోకితే అది వారి ప్రాణాలకు ప్రమాదకరమేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. కరోనా ప్రభావం మిత నుంచి తీవ్రమైన స్థాయిలో ఉంటుందని తెలిపింది. రక్తహీనత క్షయ వంటి సమస్యలతో పాటు ఇప్పుడే జన్మనిచ్చిన తల్లులు కరోనా బారినపడితే..మరణానికి దారి తీసే అవకాశాలు అధికంగా ఉంటాయని అధ్యయనం తెలిపింది
6. దేశంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ విషయం కేంద్రం దృష్టిలో ప్రాధామ్య అంశంగా ఏమీ లేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ స్పష్టం చేశారు. దాని గురించి ఎలాంటి శాస్త్రీయ చర్చలూ జరగడం లేదని చెప్పారు. ముందుగా దేశ ప్రజలందరికీ రెండు డోసులను ఇవ్వడం పూర్తయ్యాకే.. దానిపై ఆలోచిస్తామని తెలిపారు.
7. ముంబైలో నివసించే పెద్దల్లో 70-80% మంది శరీరాల్లో కరోనావైరస్ వ్యాధితో పోరాడటానికి అవసరమయ్యే యాంటీబాడీలు అభివృద్ధి అయ్యాయని సెరోసర్వేలో తేలింది. నగరంలోని 24 వార్డుల నుంచి, టీకాలు తీసుకున్నవారు, అలాగే టీకాలు తీసుకోని 8 వేల మందిపై పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెలుగూచూసినట్టుగా తెలిపింది.
8. కరోనావైరస్ రోగుల పర్యవేక్షణ కోసం ప్రైవేట్ ఆసుపత్రులలో నియమించబడిన సీనియర్ నర్సింగ్ సిబ్బంది సభ్యులందరినీ తిరిగి వారి సొంత ఆసుపత్రులకు పంపాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.
9. కరోనా నియంత్రణలో భాగంగా తమ దేశంలోని 101 కోట్లకు మందికిపైగా వేసినట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. బ్లూమ్‌బర్గ్ వివరాల మేరకు.. ఈ సంఖ్య ఆ దేశ జనాభాలో 70 శాతం అని నివేదించింది.
10. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 22.66 కోట్ల మందికి పైగా కరోనా వైరస్ సోకింది. డిసెంబర్ 2019లో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 46.63 లక్షలకు మంది మరణించినట్టు జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.