గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పోరాడుతున్నారు. ఫస్ట్ వేవ్, సెకంట్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ.. మహామ్మారి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే కొవిడ్ ఉద్ధృతి తగ్గుతోందని అనుకుంటున్న వేళ.. కొత్తరకం వేరియంట్‌లు కలవరపెడుతున్నాయి. ఇటీవల బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్తరకం వేరియంట్ ‘ఎక్స్‌ఈ’ భారత్‌లోనూ బయటపడింది. దీంతో కరోనా మళ్లీ ఫోర్త్ వేవ్ రూపంలో పంజా విసురుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలో కోవిడ్ వర్కింగ్ గ్రూప్ స్పందించింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌పై భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. తీవ్ర వ్యాధికి కారణమవుతుందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని, వేగంగా వ్యాప్తి చెందుతుందనడంపైనా సమాచారం లేదని స్పష్టం చేసింది.
ఒమిక్రాన్ నుంచి ఎన్నో కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చీఫ్ ఎన్‌కే అరోఢా చెప్పారు. ఎక్స్‌ఈ తోపాటు ఇతర రకాలు కేవలం ఎక్స్ సిరీస్‌లో భాగమే అన్నారు. ఇటువంటి వేరియంట్లు వస్తూనే ఉంటాయని.. వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి భారత్‌లో ఎలాంటి సమాచారం లేదన్నారు.
కాగా, ఒమిక్రాన్ ఎక్స్‌ఈ వేరియంట్ తొలుత బ్రిటన్‌లో వెలుగు చూసింది. అనంతరం, థాయిలాండ్, న్యూజిలాండ్ దేశాలకూ పాకింది. తాజాగా ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో వెలుగుచూశాయి.
అయితే, ఒమిక్రాన్ ఉపరకాలైన బీఏ.1, బీఏ.2 ల మిశ్రమం ఉత్పరివర్తనంగా భావిస్తోన్న ఈ వేరియంట్, దాదాపు 10 శాతం ఎక్కువ వ్యాపించే గుణం ఉన్నట్లు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కానీ భారత్‌లో ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటుంది కోవిడ్ వర్కింగ్ గ్రూప్.