చైనాలోని వుహాన్ నుంచి మరో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. మరో కొత్త వైరస్ జనజీవనం స్రవంతిలోకి ప్రవేశించిందని వుహాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి ‘నియోకొవ్’ అని నామకరణం చేశారు. ఈ వైరస్ నుంచి పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. దీని వ్యాప్తి అత్యంత వేగంగా ఉంటూ.. మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ వైరస్ బారినపడినవారిలో ప్రతీ ముగ్గురులో ఒకరు మృతి చెందుతారని అంచాన వేశారు.
అయితే.. ఈ వైరస్ కొత్తది కాదని వారు చెప్పారు. 2012, 2015లో పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్స్-కొవ్కు, నియోకొవ్తో దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పారు. ఈ వైరస్ ముందుగా దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో గుర్తించారని తెలిపారు. ప్రస్తుతానికి జంతువుల నుంచి జంతువులకు మాత్రమే సోకుతుందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్తో కలిసి వుహాన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం తేలింది.
ఇప్పటి వరకు మనుషుల్లో దీన్ని గుర్తించకపోయినా.. భవిష్యత్ లో జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని అన్నారు. ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. సార్స్ – కొవ్ - 2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
వుహాన్ శాస్త్రవేత్తలు చేసిన ఈ అధ్యయనంపై వెక్టార్ రష్యన్ స్టేట్ రీసర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ నిపుణులు కూడా స్పందించారు. నియోకొవ్ వైరస్ మనుషులకు సోకుతుందనే దానిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని చెప్పారు. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.