అమెరికాలోని క్యాపిటల్ బిల్డింగ్ వద్ద హింసకు కారణం కావడంతో సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాజా ఘటనపై చట్టపరమైన విచారణ తప్పదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తుండటంతో.. దాన్నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ మేరకు ఓ సంచలన నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని రాసింది.
మరో 12 రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న ట్రంప్.. తాను అధికారం చెలాయించిన రోజుల్లో చేసిన తప్పులన్నింటిని తానే స్వయంగా స్వీయ క్షమాభిక్ష ప్రసాదించుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై తన న్యాయ సలహాదారులతో చర్చించనట్టుగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. క్యాపిటల్ బిల్డింగ్‌పై తన మద్దతుదారులు దాడి చేయడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు ట్రంప్. ఇప్పటికే ఆయన తీరును నిరసిస్తూ ముఖ్యమైన పదవుల్లో ఉన్న కొందరు రాజీనామా కూడా చేశారు. దీంతో అధికార మార్పిడి తర్వాత తనపై న్యాయ విచారణ జరగవచ్చన్న ఆందోళన ట్రంప్‌ని వెంటాడుతోంది. దీంతో స్వీయ క్షమాభిక్ష పెట్టుకునే ఆలోచన చేస్తున్నట్టుగా అమెరికా మీడియా వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
మరోవైపు స్వీయ క్షమాభిక్ష పెట్టుకోవడం కుదరదని అక్కడి న్యాయ నిపుణులు చెప్పుకుంటున్నారు. ఇలాంటి ప్రక్రియపై అమెరికా రాజ్యాంగంలోనూ ఎలాంటి సమాచారం లేదని గుర్తు చేస్తున్నారు. స్వయంగా క్షమాభిక్ష పెట్టుకోవద్దనే నియమం కూడా రాజ్యాంగంలో లేకపోవడంతో.. ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ట్రంప్ చూస్తున్నారని అంచనా వేస్తున్నారు. కాగా గతంలో ఓసారి స్వీయ క్షమాభిక్షకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ప్రెసిడెంట్‌గా స్వీయ క్షమాభిక్ష విధించుకునే అధికారం ఉందని గట్టిగా వాదించారు. అయితే ట్రంప్ అలాంటి పనిచేసినా.. పదవి నుంచి దిగిపోయాకా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.