పూజారి మంత్రోచ్ఛరణల మధ్య పెళ్లి కూతురు- పెళ్లి కొడుకు ఒక్కటయ్యారు. వధువు, వరుడి కుటుంబ సభ్యులు వివాహ వేడుకను తిలకించి మురిసిపోయారు. తమ కూతురుకు పెళ్లి చేసి తమ బాధ్యత నెరవేర్చామని.. తమ కొడుకు మూడుముళ్ళు వేసి దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్నాడని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుల తల్లిదండ్రులు సంబరపడిపోయారు. ఇక పెళ్లి వచ్చిన వారంతా నూతన వధూవరులను కలిసి మెలిసి ఆనందంగా జీవించాలని ఆశీర్వదించడం కూడా పూర్తయింది. కానీ ఆ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. ఆ ఆనందం చూసి దేవుడికి కన్ను కుట్టిందో ఏమో కానీ పెళ్లి వేడుక విషాదాంతమైంది. అప్పటి వరకు ఉన్న ఉత్సాహం నీరుగారిపోయింది. ఒక్కసారిగా అక్కడ రోదనలు మిన్నంటాయి.
నిజామాబాద్ జిలా బోధన్ మండలం బ్రాహ్మణగల్లి లో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే పెళ్లి కొడుకు గుండెపోటుతో మృతి చెందాడు. బోధన్ పట్టణానికి చెందిన గణేష్ అనే యువకుడికి సాలూరు గ్రామానికి చెందిన స్వప్నతో శుక్రవారం వివాహం జరిగింది. పెళ్లి కార్యక్రమం ముగియడంతో ఘనంగా బరాత్ కార్యక్రమం మొదలైంది. గణేష్ ను అతని స్నేహితులు తమతో డ్యాన్స్ చేయాలనీ పట్టుబట్టారు. దాంతో అతను స్నేహితులతో కలిసి స్టెప్పులేయడం ప్రారంభించాడు. అంతలోనే గణేష్ కు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే గణేష్ ఫ్రెండ్స్ అతని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు మృతి చెందడంతో రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. పెళ్లి కూతురును దగ్గరికి తీసుకొని ఆమె కుటుంబ సభ్యులు రోదించడంతో అక్కడి ప్రాంగణమంతా విషాదంతో నిండిపోయింది.