– టీఆర్ఎస్ కు మరో షాక్ తప్పదా?
– ఇప్పటిదాకా మాజీలు గుడ్ బై
– త్వరలో ఎమ్మెల్యే రాజీనామా?
– జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?
ప్రస్తుతం తెలంగాణ అంతా మునుగోడు వైపు చూస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్.. ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ.. మరోసారి సత్తా చాటాలని టీఆర్ఎస్.. ఇలా ప్రధాన పార్టీలన్నీ తెగ ప్రచారం సాగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో గులాబీ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ కు లేఖ పంపారు. మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డ నర్సయ్య.. బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. అయితే.. బూర దారిలోనే ఇంకా చాలామంది లీడర్లు గుడ్ బై చెబుతారని టాక్ నడుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి రాజీనామాతో వచ్చింది. అయితే.. త్వరలో అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామాతో మరో బైపోల్ ఖాయమని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి త్వరలో బీజేపీ గూటికి చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని శర్వశక్తులూ ఒడ్డుతోంది బీజేపీ. ఈ క్రమంలోనే చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈటల కన్వీనర్ గా ఉన్న ఈ కమిటీ టార్గెట్ టీఆర్ఎస్ అసంతృప్త నేతలే. చర్చలు జరపడం, అధిష్టానంతో మాట్లాడి హామీ ఇవ్వడం అన్నీ సైలెంట్ గా జరిగిపోతున్నాయి.
తాజాగా బూర నర్సయ్య రాజీనామా వెనుక బీజేపీ చక్రం తిప్పిందని అనుకుంటున్నారు. కేసీఆర్ తో భేటీ అయ్యాక కూడా ఆయనతో మాట్లాడి తనవైపు తిప్పుకుందని చెబుతున్నారు. కర్నె ప్రభాకర్ కూడా ఇదే బాటలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే శేఖర్ రెడ్డి సైతం గులాబీని వదిలి కమలం చేతబడతారని చర్చ జరుగుతోంది. ఢిల్లీ కేంద్రంగా దీనిపై చర్చలు సాగినట్లు టాక్. శేఖర్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ రియల్ ఎస్టేట్. దానికి సంబంధించిన విషయాలను గ్రిప్ లో పెట్టుకుని బీజేపీ ఆయన్ను తనవైపు తిప్పుకుందని చెబుతున్నారు. ఇదే గనక నిజమైతే.. త్వరలో మరో ఉప ఎన్నిక ఖాయం అయినట్టే.
మరోవైపు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు శేఖర్ రెడ్డి. తాను బీజేపీలోకి వెళ్తున్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక చీఫ్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారని.. పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని.. అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని కోరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనన్న ఆయన.. మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు శేఖర్ రెడ్డి. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ గెలుపొందారు.