వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారానికి దగ్గర చేసేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఓవైపు ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ అనే కార్యక్రమాలతో జనంలోకి వెళ్తున్నారు. జగన్ తో ఢీ అంటే ఢీ అనేలా సవాళ్లు విసురుతున్నారు. ఇంకోవైపు అభ్యర్థుల విషయంలో పక్కా గెలుపు గుర్రాలపైనే దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతున్న చంద్రబాబు.. ఈసారి భారీ మార్పులు ఉండేలా చూస్తున్నారని ప్రచారం సాగుతోంది.
తాము గెలిచి పార్టీని నిలబెట్టే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే.. అన్నింటిలో గుడివాడ నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. తమ పార్టీలోనే ఎదిగి.. చివరకు తిరుగుబాటు చేసి.. వైసీపీలో చేరి ఇప్పుడు తలనొప్పిగా తయారైన కొడాలి నానికి చెక్ పెట్టేందుకు బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే తెరపైకి కొత్త పేరు వచ్చింది. ఆయన రంగంలోకి దిగితే కొడాలి ఓటమి తప్పదని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది.
ఒకప్పుడు గుడివాడ టీడీపీ కంచుకోట. మొదట్లో కాంగ్రెస్ హవా నడిచినా.. 1983 ఎన్టీఆర్ ప్రభంజనం తర్వాత సీన్ మారిపోయింది. ఆయనే స్వయంగా ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలిచారు. ఆ తర్వాత 1989 ఎన్నిక మినహా అన్నిసార్లు టీడీపీనే గెలిచింది. 2000 సంవత్సరం ఉప ఎన్నికలో రావి వెంకటేశ్వరరావు గెలవగా.. 2004 ఎన్నికలకు తెరపైకి కొడాలి నాని పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయనే వరుసగా గెలుస్తున్నారు. 2014, 2019లో వైసీపీ తరఫున నిలబడి గెలిచారు. అయితే.. ఈయన్ని ఓడించేందుకు టీడీపీ ప్రతీ ఎన్నికకు అనేక వ్యూహాలు రచిస్తోంది. కానీ, ఏదీ వర్కవుట్ కావడం లేదు. గత ఎన్నికల్లో దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ని పోటీకి దింపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
కొడాలి నాని రాజకీయంగా ఎదిగింది టీడీపీలోనే. ఇప్పుడు ఆ పార్టీనే అనరాని మాటలు అంటున్నారు. చివరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపైనా వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొడాలి నాని స్పీడ్ కు బ్రేక్ వేయాలని చంద్రబాబు గట్టిగా ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈక్రమంలోనే గుడివాడ పట్టణానికి చెందిన అమెరికా ఎన్నారై వెనిగండ్ల రాముని బరిలోకి దింపేందుకు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ టెక్ దిగ్గజం ఇప్పటికే చంద్రబాబుని పలుసార్లు కలిసినట్టుగా సమాచారం. ఇటు రాము కుటుంబ సభ్యులు గుడివాడలో చాపకింద నీరులా పనులు చక్కబెడుతున్నారట.
వచ్చే క్రిస్మస్ నుంచి రాము గుడివాడ జనాలకు దగ్గరై తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు విస్తృతం చేయనున్నారని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో నియోజకవర్గంలోనే మకాం వేసి యాక్షన్ ప్లాన్ ను అమలు చేయనున్నారని అంటున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉండడంతో బడుగు బలహీన వర్గాల్లో రాము కుటుంబానికి మంచి పేరుంది. పైగా ఎన్నారై కావడంతో డబ్బుకు వెనకాడాల్సిన పని లేదు. అందుకే కొడాలికి చెక్ పెట్టేందుకు రామునే కరెక్ట్ అని నియోజకవర్గంలోనూ చర్చించుకుంటున్నట్లు చెబుతున్నారు.