ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్శన్ విజయశాంతి డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌ను బదిలీ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంటితుడుపు చర్యగానే భావించాల్సి ఉంటుందని ఆమె విమర్శించారు.

రాష్ట్రపతి నివేదిక అడిగి నెల రోజులు గడిచిన తర్వాత కొత్త గవర్నర్‌కు దీనిపై వివరణ ఇవ్వాలన్న భయంతోటే కేసీఆర్ సర్కారు ఈ చర్య తీసుకుందన్న అనుమానం కలుగుతోందని విజయశాంతి చెప్పారు. కెసిఆర్ ఇంట్లో కుక్క ప్రాణానికి ఉన్న విలువ ఇంటర్ విద్యార్థులకు లేదని ఆమె చెప్పారు. తనతోపాటు కొందరు ప్రతిపక్ష నేతలు చేసిన ప్రకటనలపై సమాధానం చెప్పలేక చివరకు మొక్కుబడిగా అశోక్ కుమార్‌ను బదిలీ చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ పరిణామాలను చూస్తూ ఉంటే ముందున్నది ముసళ్ళ పండగేనని అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు.