గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టీఆర్ఎస్, ఎంఐఎంపై నిప్పులు చెరిగారు. తాము కేవలం సీట్లు పెంచుకునేందుకు మాత్రమే కాదు… ఈసారి మేయర్ స్థానంలో బీజేపీ అభ్యర్థిని కూర్చోబెట్టపోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన అమిత్ షా…. పలు ప్రశ్నలను సంధించారు. గాంధీ, ఉస్మానియా తరహాలో నిర్మిస్తామన్న నాలుగు ఆసుపత్రుల నిర్మాణం ఏమయ్యిందని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ఎంత వరకు వచ్చిందో చెప్పాలన్నారు. మీరు గతంలో చెప్పిన 100 రోజుల ప్రణాళిక ఎక్కడ వరకు వచ్చిందో చెప్పాలన్నారు.
ఎంఐఎం ఎన్నో అక్రమ కట్టడాలు చేసిందని… బీజేపీ అధికారంలోకి రాగానే అన్నింటిని కూల్చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. లక్ష ఇళ్లు అని చెప్పి 11వేలు కూడా కట్టలేదన్నారు. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కోసం కేంద్రం 4500కోట్లు ఇచ్చిందన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ ఐటీ హాబ్ గా మార్చబోతున్నామన్నారు. కేసీఆర్ ఇంటిపక్కన కూడా వరదలు వచ్చే పరిస్థితి వచ్చిందని, కేసీఆర్ ఫాంహౌజ్ నుండి బయటకు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సెటైర్లు వేశారు.
బీజేపీకి హైదరాబాద్ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరిన అమిత్ షా… బీజేపీ చేసేదే చెప్తుందని, చెప్పిన హామీని చేసి తీరుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ను నిజాం సంస్కృతిని తొలగించి మినీ భారత్ గా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని… హైదరాబాద్ దేశ ప్రజలందరిదని ఆయన తెలిపారు.
సీఎం కేసీఆర్ ఎంఐఎంతో కలిసి వెళ్తే తమకు ఇబ్బందేమీ లేదన్నారు. కేసీఆర్ సెక్రటెరియట్ కు వెళ్తే… కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో తెలుస్తుందన్నారు.