పార్లమెంట్ లో బిల్లు పాసైన వెంటనే జమ్మూ కశ్మీర్ లో పౌరసత్వ చట్టం అమలవుతున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ తదుపరి చర్య రోహింగ్యాలను తిప్పి పంపడమేనని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం వారికి ఈ దేశంలో పౌరసత్వం దక్కదన్నారు. బెంగాల్ నుంచి దేశంలోకి ప్రవేశించిన రోహింగ్యాలు పలు రాష్ట్రాలు దాటుకుంటూ వచ్చి జమ్మూ కశ్మీర్ లోని ఉత్తర ప్రాంతంలో స్ధిరపడ్డ దానిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
జమ్మూ కశ్మీర్ లో ప్రభుత్వాధికారుల శిక్షణ కార్యక్రమంలో ప్రసంగించిన మంత్రి…జమ్మూ లో రోహింగ్యాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు. వాళ్లను ఎలా తిప్పి పంపాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. అవసరమైతే బయోమెట్రిక్ ఐడెంటిటీ కార్డ్స్ ఇసుందని వెల్లడించారు. పౌరసత్వ చట్టంలో రోహింగ్యాలకు మినహాయింపు లేదని..ప్రభుత్వం ప్రకటించిన ఆరు మైనార్టీల్లో రోహింగ్యాలు లేరని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఆ మూడు పొరుగు దేశాలకు చెందిన వారు కూడా కాదన్నారు. వాళ్లు మయన్మార్ నుంచి వచ్చారు. తిరిగి వెళ్లాల్సిందేనని అన్నారు.జమ్మూ సాంబా జిల్లాలో రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ జాతీయులు కలిపి 13700 మంది విదేశీయులున్నారని…2008 నుంచి 2016 వరకు వారి పాపులేషన్ 6000 పెరిగిందని మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు.