ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపులు, ట్రాన్స్ ఫర్ కోసం గూగుల్ పే యాప్‌ను వాడుతున్నారా ? అయితే మీ కోసమే గూగుల్ త్వరలో ఓ నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఇకపై గూగుల్ పే యాప్ లో యూజర్లు near-field communication (NFC) technology system ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు చేయవచ్చు. దీన్ని ప్రస్తుతం గూగుల్ టెస్ట్ చేస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ గూగుల్ పే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
ప్రస్తుతం గూగుల్ పేలో బ్యాంక్ అకౌంట్లను యాడ్ చేసుకోవడం ద్వారా బిల్లు చెల్లింపులు, నగదు ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నారు. అయితే ఇకపై NFC ఆధారంగా పనిచేసే క్రెడిట్, డెబిట్ కార్డులను యాడ్ చేసుకోవడం ద్వారా వాటి నుంచి కూడా గూగుల్ పే ద్వారా పేమెంట్లు చేయవచ్చు. ఈ క్రమంలో ముందుగా యాక్సిస్, ఎస్‌బీఐ బ్యాంకులకు చెందిన వీసా క్రెడిట్ కార్డులకు ఈ సౌకర్యం కల్పిస్తారు. అంతర్జాతీయ కార్డులకు ప్రస్తుతానికి సపోర్ట్ అందించడం లేదు.
NFC ద్వారా గూగుల్ పే నుంచి పేమెంట్లను చేసేందుకు క్రెడిట్, డెబిట్ కార్డులను యాడ్ చేయదలిస్తే యూజర్లూ గూగుల్ పే యాప్‌లో సెట్టింగ్స్ లో ఉండే పేమెంట్ మెథడ్స్ లోని యాడ్ కార్డ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అనంతరం అందులో కార్డుకు చెందిన నంబర్, ఎక్స్‌పైరీ తేదీ, సీవీవీ నంబర్, కార్డుపై ఉండే హోల్డర్ పేరు, బిల్లింగ్ వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత సేవ్ బటన్ ను ప్రెస్ చేయాలి. దీంతో కన్ఫర్మేషన్ ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి కన్ఫాం చేస్తే ఆ కార్డు గూగుల్ పేలో యాడ్ అవుతుంది. తరువాత దాంతో NFC ద్వారా గూగుల్ పే నుంచి పేమెంట్లు చేయవచ్చు.
అయితే ప్రస్తుతం కేవలం ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్రస్తుతం టెస్ట్ చేస్తోంది. అయితే కార్డులను పై విధంగా యాడ్ చేశాక యూజర్లకు ఒక వర్చువల్ అకౌంట్ నంబర్ క్రియేట్ అవుతుంది. దాని సహాయంతో పేమెంట్లు జరుగుతాయి. కనుక యూజర్లకు చెందిన కార్డు వివరాలు ఇతరులకు తెలియవు. ఈ విధంగా కార్డు సురక్షితంగా ఉంటుంది. దాని సమాచారాన్ని ఇతరులెవరూ చోరీ చేయలేరు. అయితే ఈ విధంగా కార్డులను యాడ్ చేయాలన్నా గూగుల్ పేలో యూజర్లు కచ్చితంగా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్‌ను ముందుగా యాడ్ చేసి వాడాలి.
గూగుల్ పే NFC పేమెంట్ కు రిజిస్టర్ చేసుకున్నాక వారు NFC ఉన్న పీవోఎస్ మెషిన్లు, మర్చంట్ల వద్ద సింపుల్ గా గూగుల్ పే ను ట్యాప్ చేసి పేమెంట్ చేయవచ్చు. మాటి మాటికీ కార్డులను తీయాల్సిన పని ఉండదు. ఈ విధంగా ఫోన్ ద్వారా పూర్తిగా కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో పేమెంట్లు చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీంతో మర్చంట్ల వద్ద క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి కూడా పేమెంట్లు చేయవచ్చు. అయితే గూగుల్ ఏడాది కిందటే ఈ ఫీచర్‌ను ప్రకటించినా ఇంకా ఇది టెస్టింట్‌లోనే ఉంది. కానీ చివరి దశ టెస్టింగ్‌కు వచ్చినందున అతి త్వరలోనే దీన్ని గూగుల్ పే యూజర్లందరికీ గూగుల్ అందించనుంది.