పెద్దపల్లి జిల్లాలో ఇసుక రీచ్ ల వ్యవహారంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సదరన్ బెంచ్ కేంద్ర పర్యావరణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మానేరు నదిలో ఇసుక తవ్వకాలకు సంబంధించిన పిటిషన్ గొట్టిముక్కుల సురేష్ రెడ్డితో పాటు మరికొందరు ఎన్జీటీలో వేశారని ఇందులో పిటిషనర్ తరుపు వాదనలు కూడా పూర్తయ్యాయని బెంచ్ వెల్లడించింది.
అయితే ఇందుకు సంబంధించిన అడిషనల్ అఫిడవిట్ సమర్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను బెంచ్ ఆదేశించింది. బుధవారం జరిగిన విచారణ అనంతరం ఉత్తర్వులు జారీ చేసిన ఎన్జీటీ కేంద్ర పర్యావరణ విభాగం వాణిజ్య అవసరాలకు ఇసుక తీయోచ్చా.. అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని బెంచ్ స్పష్టం చేసింది. సంతృప్తికరమైన సమాధానం ఇవ్వనందున అడిషనల్ అఫిడవిట్ ద్వారా సరైన సమాధానం ఇవ్వాలని ఎన్జీటీ సదరన్ బెంచ్ స్పష్టం చేసింది.
మరో వైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలను ధిక్కరించి ఇసుక రవాణా చేస్తున్నారని కూడా పిటిషనర్ గొట్టిముక్కు సురేష్ రెడ్డి తరుపు న్యాయవాది బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్జీటీ ఉత్తర్వులను ధిక్కరిస్తున్న పిటిషన్ కూడా వేయాలని బెంచ్ పిటిషనర్ కు సూచించింది. వచ్చే నెల 15 కు కేసు విచారణ వాయిదా వేశారు.