జలవివాదాల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రికి.. అక్కడ అడుగుపెట్టకముందే ఊహించని షాక్ తగిలింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఏపీ ఫిర్యాదు మేరకు ప్రాజెక్టును పరిశీలించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) సంయుక్త కమిటీ ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేసింది. తాగు నీటి ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో సాగునీటి ప్రాజెక్టుపనులు కూడా జరుగుతున్నాయని తమ నివేదికలో స్పష్టం చేసింది. తుది నివేదికను 8 వారాల్లో సమర్పిస్తామని సంయుక్త కమిటీ ఎన్జీటీకి తెలిపింది.
ఇదిలా ఉంటే ఎలాంటి అనుమతులు లేకుండానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోందని, వెంటనే పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్జీటీని ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-1, 2లో దీనికి కేటాయింపు లేదని, విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో కూడా లేదని ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎన్జీటీ ముందు రెండు అఫిడవిట్లను సమర్పించింది.
విభజన చట్టంలోని 11వ షెడ్యూలు ప్రకారం తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ మినహా మిగిలినవన్నీ కొత్తవేనని అందులో పేర్కొంది. ఇదే సమయంలో శ్రీశైలం నుంచి 90 టీఎంసీల నీటిని తాగునీటి ప్రాజెక్టు తరలిస్తామని చెప్పి.. సాగునీటి ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందని ఆరోపించింది. పర్యావరణ అనుమతులు అవసరం రాకుడదనే ఇలా చేసినట్టుగా అందులో ఫిర్యాదు చేసింది. పైకి తాగునీటి ప్రాజెక్టు అని అంటున్నప్పటికీ.. తెలంగాణ సాంకేతిక సలహా కమిటీ నివేదికలోనూ, కృష్ణా ట్రైబ్యునల్-2కు సమర్పించిన అఫిడవిట్‌లోనూ పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుగానే ఉందని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్జీటీ జోక్యం చేసుకుని, నిజ నిర్ధారణ కోసం సంయుక్త కమిటీని నియమించింది.