రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఎన్.జి.టి ఆదేశించింది. ఎన్.జి.టి ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం పై గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ రామకృష్ణన్, సైబల్ దాస్ గుప్త నేతృత్వంలోని ఎన్ జి టి చెన్నై బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టు పనులను చేపట్టడం లేదని ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రమాణం చేసి అఫిడవిట్ దాఖలు చేశారని ఆంధ్రప్రదేశ్ తరుఫు సీనియర్ న్యాయవాది వెంకట రమణి వివరించారు. ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో మార్పులపైన అధ్యయనం జరుగుతోందని వివరించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ వైపు నుంచి పిటిషన్ దాఖలు చేశారని సీనియర్ న్యాయవాది వెంకట రమణి ఆరోపించారు. ప్రభుత్వ వాదనలపై అభ్యంతరం తెలిపిన పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్… ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ సాగునీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి గా ఉన్నప్పుడే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టారని వివరించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ గత ఏడాది డిసెంబర్ లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదన్నారు.
తాము దాఖలు చేసిన పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో వేసిందన్న సీనియర్ న్యాయవాది వాదన కూడా సరికాదని, ప్రస్తుతం ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల వివాదంపై నివేదిక ఇచ్చేందుకు తమకు సమయం కావాలని కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ట్రిబ్యునల్ ను అభ్యర్థించింది. అందరి వాదనలు విన్న ఎన్ జి టి చెన్నై బెంచ్, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డును ఆదేశించింది
ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్ల పిటిషనర్ పలు ఫోటోలు సమర్పించినప్పటికీ, తాము చేస్తున్న పనులు సిడబ్ల్యుసి నిబంధనలు మేరకు డిపిఆర్ తయారు చేసేందుకే అని స్వయంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన ప్రమాణ పత్రాన్ని తోసి పుచ్చలేమని ఎన్ జి టి చెన్నై బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు పనులు పై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర పెండింగ్ లో ఉన్నందువల్ల దానిపై ముందు సాధ్యం అయినంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని బెంచ్ అభిప్రాయపడింది.