– నీటిపారుదల శాఖకు ఎన్జీటీ ఆదేశం
– మై హోం కట్టడాలపై అధ్యయనం చేయాలని వెల్లడి
హైదరాబాద్ లో ప్రభుత్వ అండదండలతో ఎన్నో కట్టడాలను నిర్మించింది మై హోం సంస్థ. కేసీఆర్ సర్కార్ తో ఉన్న సత్సంబంధాలతో తక్కువ మొత్తంలోనూ భూములను దక్కించుకుని నిర్మాణాలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక క్విడ్ ప్రో కో వ్యవహారాలు నడిచాయనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. అయినా కూడా మై హోం సంస్థ విచ్చలవిడిగా నిర్మాణాలను చేపడుతూనే ఉంది.
కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. పాత రికార్డులన్నీ చెరిగిపోతున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వరద నీరు కాలనీలను ముంచెత్తుతోంది. దాని ఫలితంగా అనేక మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. డ్రైనేజీలు, నాలాలను కబ్జాలు పెట్టడం వల్లే వరద నీటిని దారి లేక ఇళ్లన్నీ మునిగిపోతున్నాయి. ప్రభుత్వం వరదలు ముంచెత్తినప్పుడు ప్రగల్భాలు పలకడం తప్ప.. తర్వాత ఏం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. విచ్చలవిడిగా నగరంలో జరుగుతున్న నిర్మాణాలు కూడా వరద నీటి రూట్ ను మార్చేస్తున్నాయి.
ఈ క్రమంలో.. భారీ నిర్మాణాలు చేపట్టిన చోట వరదనీరు వెళ్లడానికి మై హోం సంస్థ తీసుకున్న చర్యలు సరిపోతాయో లేదో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖను జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. చెరువు ప్రాంతంలో మై హోం సంస్థ చేపట్టిన నిర్మాణాల వల్ల నీటి వనరులకు నష్టం జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు.
రేవంత్ పిటిషన్ ఆధారంగా ఎన్జీటీ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. క్లౌడ్ బరస్ట్ వంటి పరిణామాలతో భారీగా వచ్చే వరదనీరు వెళ్లడానికి మై హోం సంస్థ నిర్మించిన బాక్సు కల్వర్టులు సరిపోతాయో లేదో పరిశీలించాలని నీటిపారుదల శాఖను ట్రైబ్యునల్ ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపింది.