మూమూలుగా రోడ్డు వేయాలంటే చాలా సమయం పడుతుంది. నగరాల్లో అయితే.. రాత్రుళ్లు జనం తక్కువగా ఉండే సమయంలో వేస్తారు. అది కూడా ఒకరోజు తవ్వడం.. మరో రోజు రోడ్డు వేయడం చేస్తుంటారు. అదే బయట రహదారుల్లో రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త త్వరగానే కానిచ్చేశారు. అయితే.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త రికార్డ్ సృష్టించింది.
రికార్డ్ అంటే మామూలు రికార్డ్ కాదు. ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒకే వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. అదికూడా ఐదు రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఇప్పటిదాకా ఖతార్ పేరుతో ఉన్న రికార్డు చెరిగిపోయింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన చేశారు. గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ ను, రోడ్డు నిర్మాణ ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.
మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా వరకు ఉన్న జాతీయ రహదారి 53పై గత శనివారం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది ఎన్‌హెచ్‌ఏఐ. మొత్తం 75 కిలోమీటర్లను 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసింది. దీంతో అతి తక్కువ సమయంలో రోడ్డు నిర్మాణం చేసినట్లు గిన్నీస్ రికార్డుల్లో నిలిచింది.
ఎన్‌హెచ్‌ఏఐ తరఫున రాజ్ పుత్ ఇన్ ఫ్రాకాన్ అనే సంస్థ ఈ రోడ్డు వేసింది. మొత్తం 800 మంది ఉద్యోగులు, 700 మంది కార్మికులు ఈ పనుల్లో పాల్గొన్నారు.
Advertisements