తెలంగాణ డీజీపీకి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చిందని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ తెలిపారు. డీజీపీతో పాటు నిజామాబాద్ ఎస్పీకి కూడా ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం….
నిజామాబాద్ జిల్లాలో డేరా బక్తార్ మండలం చేపూర్‌కు చెందిన టీఆర్ఎస్ నేత, వార్డు మెంబర్ చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళ కూతురు(9)పై చంద్రశేఖర్ కన్ను పడింది.
ఈ ఏడాది ఆగస్టులో కానిస్టేబుల్ పరీక్షలు రాసేందుకు సదరు మహిళ వెళ్లింది. ఈ విషయం గ్రహించిన చంద్రశేఖర్ ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. మత్తు మందు కలిపిన ఐస్ క్రీమ్‌ను బాలికకు ఇచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కానీ బాలికకు చికిత్స చేసేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో నిందితుడు తన బైక్‌పై బాలికను తీసుకుని నిజామాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడ సిబ్బందికి బాలికను అప్పగించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆస్పత్రి సిబ్బంది ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్ హెచ్ఆర్సీ)కి ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ ఈ కేసులో వాదనలు విన్నది. అనంతరం రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు నిజామాబాద్ ఎస్పీకి నోటీసులు పంపింది.