నిషిధ్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఒక లాయర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడంటే నమ్మలేం.. కానీ ఈ రోజుల్లో ఏదైనా నమ్మవలసిందే. చట్ట వ్యతిరేకమైనవి, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడే ఈ సంస్థపై జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్ఐఏ ఉక్కుపాదం మోపి దేశమంతా సోదాలు జరుపుతోంది. ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులపై కేసులు పెట్టి అరెస్టు చేస్తోంది. ఈ క్రమంలోనే కేరళలో శుక్రవారం విస్తృత రైడ్స్ నిర్వహించినప్పుడు ఓ లాయర్ పట్టుబడ్డాడు.
ఎర్నాకులం జిల్లాలోని ఎడవ నక్కడ్ టౌన్ కి చెందిన మహమ్మద్ ముబారక్ అనే ఈ లాయర్ ..కోర్టుకు వెళ్లి తన లాయర్ వృత్తి నిర్వహిస్తూనే.. మరోవైపు ఈ నిషిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడట. కేరళలో 56 చోట్ల రైడ్స్ నిర్వహించినప్పుడు పట్టుబడిన ఈ సంస్థ కార్యకర్తల్లో ఈయన 14 వ వాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ లో ఈయన నిపుణుడేగాక.. హిట్ స్క్వాడ్ ట్రైనర్ కమ్ మెంబర్ కూడానని తెలిసి తాము ఆశ్చర్యపోయామన్నారు.
ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా ఓ బ్యాడ్మింటన్ రాకెట్ బ్యాగ్ లో దాచిన గొడ్డలి, కత్తులు, కొడవళ్లు, మరికొన్ని ఆయుధాలు చూసి షాక్ తిన్నామని వారు చెప్పారు. ఇతర మతాల నాయకులను టార్గెట్ గా చేసుకుని వారిపై దాడులు చేసేందుకు వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో హిట్ స్క్వాడ్లు, ఇతర ట్రెయినింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వీటిలో .. అమాయక యువతకు..ముఖ్యంగా ముస్లింయువకులకు శిక్షణ ఇచ్చే ఇలాంటి ముఠాలు చాలా ఉన్నాయని వెల్లడించారు.
దాదాపు 15 మంది ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్లు, ట్రైనర్ల ఇళ్లలో కత్తులు, డాగర్లు, ఇతర ఆయుధాలను కనుగొని వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేరళలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఈ సంస్థతో ఓ లాయర్ కూడా లింక్ పెట్టుకున్నాడంటే ఈ సంస్ధ నెట్ వర్క్ ఎలా ఉందో ఊహించగలమని ఎన్ఐఏ వర్గాలు పేర్కొంటున్నాయి.