అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. వారిద్దరూ దావూద్ అనుచరుడు చోటా షకీల్ కు అత్యంత సన్నిహితులు అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మేరకు వారిని నగర సరిహద్దుల్లో అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. అరెస్టైన వారిలో అబుబకర్ షేక్, షబ్బీర్ అబూ బకర్ షేక్ లు ఉన్నట్టు అధికారులు చెప్పారు.
‘వారిద్దరినీ నగర పశ్చిమ సరిహద్దుల్లో పట్టుకుని అరెస్టు చేశాము. దావూద్ ఇబ్రహీం సిండికేట్ కేసులో వీరిద్దరని అదుపులోకి తీసుకున్నాము’ అని తెలిపారు.
వారిద్దరికీ దావూద్ అనుచరుడు చోటాషకీల్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల ముంబైలోని పలు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు వారు పేర్కొన్నారు.
దావుద్ డీ కంపెనీపై ఫిబ్రవరి 3న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఉగ్రకార్యకలాపాల ద్వారా భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణల మేరకు వారిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మే 9న ముంబైలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.