భాగ్యనగర్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన జాహెద్ ముఠాపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేపట్టింది. దీనిపై ఇప్పటికే ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. తాజాగా విచారణను హైదరాబాద్ పోలీసుల నుంచి ఎన్ఐఏ తన చేతిల్లోకి తీసుకుంది.
తాజాగా ముగ్గురు నిందితులపై ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ ముగ్గురు పాకిస్తాన్ ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రసంస్థల ఆదేశాల మేరకు దాడులు చేసేందుకు యువకులను రిక్రూట్ చేస్తున్నారంటూ ఎఫ్ఐఆర్ లో ఎన్ఐఏ పేర్కొంది.
దసరా వేడుకల్లో పేలుళ్లకు జాహెద్ ముఠా ప్రణాళికలు రచించింది. పాకిస్తాన్, నేపాల్ మీదుగా పేలుడు పదార్థాలను హైదరాబాద్ కు ముఠా తరలించింది. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను ఎన్ఐఏ గుర్తించింది.
నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో జాహెద్, సమిద్దున్, మజా హసన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. దసరా వేడుకల సమయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలను హత్య చేసేందుకు వీరు కుట్రపన్నినట్టు పోలీసులు గుర్తించారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ లో నగర పోలీస్ కమిషనర్, హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో ఓ హోంగార్డు మరణించారు. ఈ ఘటన సమయంలో ఆత్మాహుతి బాంబర్‌కు జాహద్ ఆశ్రయం కల్పించాడు.
ఈ కేసులో 12 ఏండ్ల జైలు శిక్షను జాహెద్ అనుభవించాడు. జైలు నుంచి వచ్చాక కూడా జాహెద్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో జాహెద్‌పై పోలీసులు నిఘా పెట్టారు. హైదరాబాద్ పేలుళ్లకు పోలీసులే కుట్ర పన్నారని పోలీసులు గుర్తించి జాహెద్‌ను అదుపులోకి తీసుకున్నారు. జాహెద్ ను విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.