పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఛార్జ్ షేట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్‌లో మొత్తం 11 మంది పేర్లను ఎన్ఐఏ చేర్చింది. ఈ కేసులో నిజామబాద్‌తో పాటు హైదరాబాద్ లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి నిందితులను గుర్తించింది.
మొత్తం 25 మందిని గుర్తించి వారి దగ్గర నుంచి వాంగ్మూలాన్ని ఎన్ఐఏ సేకరించింది. ఉగ్ర శిక్షణ శిబిరాన్ని నిర్వహించినందుకు, పీఎఫ్ఐ ఉగ్ర కార్యకలాపాలకు వ్యక్తులను నియమించినందుకు గాను పలువురిపై కేసులు నమోదు చేసినట్టు ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
నిజామాబాద్‌లో పీఎఫ్ఐ పేరిట మతపరమైన దాడులకు కుట్ర పన్నినట్లు జూలైలో గుర్తించారు. నిందితులు అమాయకులైన ముస్లిం యువతను శిక్షణ పేరుతో ఉగ్రవాదం వైపు మళ్లేలా చేస్తున్నట్టు విచారణలో తేలినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు, విషప్రచారాలు చేస్తూ వారిని ఉగ్రవాదం వైపునకు మరలుస్తున్నట్టు పేర్కొన్నాయి. అనంతరం వారిని యోగా శిక్షణా తరగతులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పేరిట ఉగ్ర శిక్షణను ఇస్తున్నట్టు వెల్లడించాయి.