దేశంలో ఆరు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఎన్ఐఏ దాడులు చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, బిహార్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకు సంబంధించి ఈదాడులను నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ కేసును ఎన్ఐఏ సుమోటోగా తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మహారాష్ట్రలోని కొల్హాపుర్, నాందేడ్, గుజరాత్‌లోని సూరత్, భరుచ్, నవ్సారి, అహ్మదాబాద్.. కర్ణాటకలోని తుమ్కుర్, భత్కల్, బిహార్‌లోని ఆరియా, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, యూపీలోని దేవ్‌బంద్ జిల్లాలో ఈ దాడులు చేపట్టింది.
ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న వ్యక్తిని కర్ణాటకలోని భత్కల్ లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. 30ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసిన ఎన్ఐఏ అతన్ని రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నామని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వెల్లడించింది. ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉందన్న ఆరోపణలపై బిహార్‌లోని నలంద జిల్లాలో ఎన్ఐఏ గురువారం దాడులు చేసింది.