పాట్నాలో ఉగ్రదాడి కుట్ర వ్యవహారంలో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. దర్భాంగాలో పలు చోట్ల ఎన్ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు. ఉగ్రవాద అనుమానితులైన సనావుల్లా, నూరుద్దీన్, ముస్తాఖీం నివాసాలపై ఎన్ఐఏ దాడులు చేస్తోంది.
ఆ ముగ్గురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)లో క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు. వారిలో నూరిద్దీన్ ప్రస్తుతం పట్నా జైలులో ఉన్నాడు. మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసులో వారం క్రితమే ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. తాజాగా ఈ కేసులో గురువారం దర్యాప్తు ప్రారంభించింది. మూడు గంటలుగా దాడులు కొనసాగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించాయి.
ఈ నెల 14న పాట్నా మాడ్యూల్ ను పోలీసులు ఛేదించారు. 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చడమే టార్గెట్ గా నిందితులు పెట్టుకున్నారని పోలీసులు వెల్లడించారు. ప్రధాని మోడీని టార్గెట్ చేసుకోవాలని వారు కుట్రలు పన్నారని పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసు విచారణను ఎన్ఐఏకు కేంద్రం హోం శాఖ ఇటీవల అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే 26 మంది అనుమానిత ఉగ్రవాదుల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. వీరంతా పీఎఫ్‌ఐ క్రియాశీలక సభ్యులు కావడం గమనార్హం.