దేశంలో 8 రాష్ట్రాల్లో ఎన్ ఐఏ ఏకకాలంలో దాడులు చేసింది. ఒకేసారి 70 ప్రాంతాలకు పైగా తనిఖీలు నిర్వహించింది. పంజాబ్, రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్య ప్రదేశ్‌లో దాడులు నిర్వహించి సోదాలు చేపట్టింది. అక్రమ ఆయుధాల వ్యాపారులు, గ్యాంగ్ స్టర్లు ప్రధాన లక్ష్యంగా అధికారులు దాడులు నిర్వహించారు.
గ్యాంగ్‌స్టర్ టెర్రర్ ఫండింగ్ కేసులకు సంబంధించి ఎన్ ఐఏ దూకుడు పెంచింది. అన్ని ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది ఎన్ ఐఏ.ఈ దాడుల్లో ఆరుగురు గ్యాంగ్ స్టర్లను విచారించగా.. వారితో పాటు మరి కొంత మంది గ్యాంగ్‌స్టర్ల పేర్లు తెరమీదకి వచ్చాయని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. ప్రశ్నించిన గ్యాంగ్‌స్టర్ల ఇళ్లు, వారితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలపై, వారి సహచరుల ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది.
గ్యాంగ్‌స్టర్లకు ఇతర దేశాల్లో పరిచయాలు ఉన్నాయనే విషయం తెరపైకి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లారెన్స్ బిష్ణోయ్, బవానా గ్యాంగ్ పేరుతో భారత్‌లో ఉగ్రదాడులకు భారీగా నిధులు సమకూరుతున్నట్లుగా తేలింది.గ్యాంగ్‌స్టర్లను దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారనే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది.
ఎన్‌ఐఏ వర్గాల అందించిన సమాచారం ప్రకారం, గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నిధుల కేసులో ఏజెన్సీ ఇప్పటి వరకు మూడు సార్లు దాడులు నిర్వహించింది. ఇది నాల్గవ సారి. దీనికి ముందు కూడా, గత ఏడాది చివరిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి.