ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. మాలిక్ ఇటీవల తన నేరాన్ని అంగీకరించడంతో కోర్టు గురువారం తీర్పు వెలువరిస్తూ.. అతడిని దోషిగా నిర్థారించింది. మే 10న యాసిన్ మాలిక్ తనపైన నమోదైన అన్ని కేసుల్లో కోర్టు ఎదుట నేరాన్ని అంగీకరించాడు.
అయితే.. మే 25న అతడికి శిక్ష ఖరారు చేయనున్నట్టు కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మాలిక్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే.. యాసిన్ మాలిక్ ఆర్థిక పరిస్థితిపై నివేదిక అందించాలని కోర్టు ఎన్ఐఏ అధికారులను ఆదేశించింది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత అతడికి ఎంత జరిమానా విధించాలన్నది నిర్ణయిస్తామని కోర్టు పేర్కొంది.
2017లో కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్ పై ఎన్ఐఏ కోర్టు కేసు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద, చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం మాలిక్.. ‘ఫ్రీడమ్ స్ట్రగుల్’ పేరుతో నిధుల సమకూర్చాడని దర్యాప్తులో తేలింది. దీనికోసం ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే.. ఈ కేసులో మాలిక్ తో పాటు పలువురు కాశ్మీర్ వేర్పాటువాద నేతలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌లపై కూడా చార్జీషీట్ దాఖలైంది. జమ్మూ-కశ్మీరు లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యక్రమాల కోసం నిధులను సేకరించేందుకు మాలిక్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. స్వాతంత్ర్యోద్యమం పేరుతో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎన్ఐఏ ఆరోపించింది.