దేశంలో ఉగ్ర కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇందులో నిజామాబాద్ జిల్లాలోని ఉగ్రవాద లింకులు కలకలం రేపడంతో మరింత స్పీడ్ పెంచింది. అయితే ఉగ్రవాద ముసుగులో యువతకు కరాటే నేర్పించిన విషయంలో ఇంకా విచారణ కొనసాగుతూ ఉండగానే ఆర్మూరులో ఐసిస్ ఉగ్రవాద లింకులు వెలుగు చూడటం ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్మూర్ జీరాయత్ నగర్ కు చెందిన షేక్ నవీద్ కు ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని భావించిన ఎన్ఐఎ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్మూర్ కి చెందిన షేక్ నవీద్ వ్యవహారాలపై ఎన్ఐఎ విచారణ వేగవంతం చేసింది. నవీద్ పాస్ పోర్ట్, బ్యాంకు ఖాతాలు, సెల్ ఫోన్లు సీజ్ చేసింది ఎన్ఐఏ. ఆగస్టు 12న షేక్ నవీద్ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. షేక్ నవీద్ అకౌంట్ లోకి విదేశాల నుంచి వచ్చిన డబ్బు ఏమైంది అనే కోణంలో విచారణ చేపడుతుంది ఎన్ఐఎ. అతడికి విదేశాల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ పై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా.. ఇంకా ఆరు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేసింది. ఉగ్ర లింకులు ఉన్న అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సోదాల్లో భాగంగా.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.