తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూరుస్తున్న కేసుకు సంబంధించి ఈ దాడులు కొనసాగుతున్నట్టు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. కరైకల్, మైలాడుతురై, చెన్నైలలో ఎన్ఐఏ సోదాలు చేస్తోందని అధికారులు తెలిపారు.
ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థకు నిధులు సమకూరుస్తూ, ప్రచారం చేస్తున్నారని తమిళనాడు పోలీసులు ఇటీవల ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఆ ఐదుగురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
తాజాగా నిందితులకు సంబంధించిన ఆఫీసులు, వారి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తోంది. వారి ఇండ్లలో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారి ఒకరు తెలిపారు.
అంతకుముందు మే నెలలోనూ మైలాడుతురైలో ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాది మహ్మద్ ఆషిక్ (25)ను పోలీసులు అరెస్టు చేశారు. 2018 నుంచి అతను ఐఎస్‌ఐఎస్‌కు అనుబంధంగా పనిచేస్తున్నట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.