కేరళలోని నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై జాతీయ దర్యాప్తు సంస్థ కొరడా ఝుళిపిస్తోంది. 56 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేసి పీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు,సభ్యులు,ఇతర కార్యకర్తల ఇళ్ళు,ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు.ఈ సంస్థ చాలా కాలం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో పాటు అక్రమ నిధుల కేసులో తిరువనంతపురం,కొల్లాం, పటానంతిట్ట, ఎర్నాకుళం, అళప్పుజ, మళప్పురం జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
బుధవారం కూడా ఎన్ఐఏ అధికారులు పీఎఫ్ఐ సభ్యులు, ఆఫీస్ బేరర్లు,కార్యకర్తలతో పాటు సానుభూతిపరుల ఇళ్ళపై కూడా దాడులు నిర్వహించారు. దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గట్టిగా ఉండడంతో..ఈ సంస్థను బ్యాన్ చేయడం జరిగింది. అయితే పీఎఫ్ఐ పై నిషేధం తర్వాత మరో పేరుతో తిరిగి సంస్థను స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఇక ఇప్పటికే వంద మందికి పైగా పీఎఫ్ఐ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ నిషేధిత సంస్థలోని సభ్యులే తిరిగి క్రియాశీలకంగా మారడానికి మరో సంస్థను స్థాపించే పనిలో పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు దాడులను మొదలు పెట్టారు. గతంలో సంస్థలో పనిచేసిన వారితో పాటు సానుభూతిపరులు, అనుమానితులను కూడా వదిలిపెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎన్ఐఏ అధికారులు.