ఈ ఏడాది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దూకుడు మీద ఉంది. 2022లో అత్యధికంగా 73 కేసుల్లో అభియోగాలను ఎన్ఐఏ నమోదు చేసింది. గతేడాది ఎన్ఐఏ 61 కేసులు నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 19.67శాతం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
ముంబైలో 26/11 ఉగ్రదాడి అనంతరం ఎన్‌ఐఏను ప్రారంభించారు. అప్పటి నుంచి చూస్తే ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఈ కేసుల్లో జిహాదీ కేసులు 35 ఉన్నాయి. జమ్మూకశ్మీర్, బీహార్, అసోం, ఢిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటకలో జిహాదీ ఉగ్రవాద కేసులను ఎన్‌ఐఏ నమోదు చేసింది.
ఈ ఏడాదిలో ఎన్ఐఏ చేపట్టిన అతి పెద్ద కేసుల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కేసు ఒకటి. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మూడు సార్లు దాడులు చేసింది. మొత్తం 200 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. పీఎఫ్‌ఐకి చెందిన 100 మంది వ్యక్తులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
ఈ ఏడాది మొత్తం 368 మందిపై 59 ఛార్జ్ షీట్‌లను దాఖలు చేసింది. 456 మంది నిందితులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అందులో 19 మంది అనుమానితులు కూడా ఉన్నారు. దేశ బహిష్కరణపై ఇద్దరు నిందితులను, ఓ నిందితున్ని స్వదేశానికి తీసుకు వచ్చి ఎన్ఐఏ అరెస్టు చేసింది.